శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 18, 2020 , 03:28:33

చైనాకు భారత్‌ చేయూత

చైనాకు భారత్‌ చేయూత
  • ఔషధాలు, వైద్య పరికరాలతో వుహాన్‌కు త్వరలో వెళ్లనున్న విమానం
  • తిరుగు ప్రయాణంలో భారతీయులతోపాటు పొరుగు దేశాల పౌరుల తరలింపు

బీజింగ్‌/ హాంకాంగ్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)తో అల్లాడుతున్న చైనా కు వైద్య సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. చైనా లో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న వుహాన్‌ నగరానికి ఔషధాలు, వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక సహాయ విమానాన్ని పంపనుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో భారతీయులతోపాటు ఇరుగుపొరుగు దేశాల వారినీ తీసుకు రానున్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. తాజాగా ఆదివారం 105 మంది మృతితో చైనాలో కరోనాతో మొత్తం 1,770 మంది మరణించారు. కొత్తగా 2,048 మందికి ఈ  వైరస్‌ సోకింది. దీంతో కోవిద్‌-19తో బాధపడుతున్న వారి సంఖ్య 70,548 మందికి చేరింది. మరోవైపు హాంకాంగ్‌లో తాజాగా ఒకరి మృతితో మొత్తం మరణాల సంఖ్య 50కి చేరింది. కరోనా వైరస్‌ వల్ల టాయిలెట్‌ పేపర్‌ కొరత ఏర్పడనున్నదన్న వదంతుల నేపథ్యంలో ఒక సాయుధ ముఠా.. ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లారు. అయితే వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. జపాన్‌ తీరంలో నిలిపి ఉన్న క్రూయిజ్‌ నౌకలో మరో 99 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని 454 మంది నావికులకు వైరస్‌ సోకినట్లు తేలింది. 


logo