వాషింగ్టన్: గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (Gavi) ఇండియాకు పూర్తి సబ్సిడీపై 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు, 3 కోట్ల డాలర్ల (సుమారు రూ.220 కోట్లు) నిధులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నిధులను సాంకేతిక సాయం, కోల్డ్చెయిన్ పరికరాలు సమకూర్చుకోవడానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై కొవాక్స్ బోర్డు గత డిసెంబర్లోనే నిర్ణయం తీసుకున్నట్లు Gavi అధికార ప్రతినిధి చెప్పారు. ఈ Gavi తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో పూర్తి మద్దతుగా ఉంటామని Gavi అధికార ప్రతినిధి హామీ ఇచ్చారు.
అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్ (ఏఎంసీ)లో అందుబాటులో ఉన్న మొత్తం డోసులలో 20 శాతం ఇండియాకు ఇవ్వాలని కొవాక్స్ బోర్డు గత డిసెంబర్లోనే నిర్ణయించినట్లు చెప్పారు. ఇవి సుమారు 19 కోట్ల నుంచి 25 కోట్ల వరకూ ఉంటాయని, వ్యాక్సిన్ ధరలు, అందుబాటులో ఉన్న నిధులను బట్టి పూర్తి సబ్సిడీపై వీటిని ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అందుబాటులో ఉన్న మొత్తం నిధుల్లో 20 శాతం కూడా ఇండియాకు దక్కనున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇండియాలో సంక్షోభం తమ వ్యాక్సిన్ల పంపిణీ ప్రభావం చూపినట్లు Gavi తెలిపింది.