గురువారం 02 జూలై 2020
International - Jun 24, 2020 , 19:47:52

భారత్‌ తీరును తప్పుపట్టిన గ్లోబల్‌ టైమ్స్‌

భారత్‌ తీరును తప్పుపట్టిన గ్లోబల్‌ టైమ్స్‌

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణ పట్ల భారతీయ సైన్యం, మీడియా వ్యవహరించిన తీరును చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ ఖండించింది. ఆ పత్రిక ఎడిటర్‌ ఈ ఘటన పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన తీరును ఇండియన్‌ మీడియా కవరేజ్‌ చేసిన విధానం స్వీయమోసంగా ఉన్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. జాతీయవాదులను సంతోషపెట్టేందుకు నలభై మంది చైనా సైనికులు చనిపోయినట్లు భారతీయ మీడియా కథనాలు రాసినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. జూన్‌ ౧౫వ తేదీన జరిగిన గాల్వన్‌ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే,  భారత్‌ కేవలం సైనికుల మృతదేహాలను మాత్రమే లాభంగా పొందినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటోరియల్ పేర్కొన్నది. 

 గాల్వన్‌ ఘటన ద్వారా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ .. భారత దళాలకు గట్టి సమాధానం ఇచ్చిందని,  చైనా ప్రజల విశ్వాసాన్ని భారత్‌ తప్పుగా అర్థం చేసుకున్నదని ఆ వ్యాసంలో పేర్కొన్నది. భారత సైన్యాన్ని పీఎల్‌ఏ ఎదుర్కొన్న తీరు అసాధారణమని, ఆ దేశ సైన్యంపై మానసిక విజయాన్ని సాధించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. ౩౦ ఏళ్ల నుంచి ఎటువంటి యుద్ధం చేయకపోయినా.. తమ సత్తా ఏందో భారత్‌ చూసిందని చైనా మీడియా పేర్కొన్నది.  శాంతి కోరుకోవడం వల్లే తాము గత ౩౦ ఏళ్ల నుంచి ఎటువంటి యుద్ధం చేయలేదన్నారు.   

లడఖ్‌ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన పీఎల్‌ఏ ఆఫీసర్లు, సైనికులకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులపై దేశ భద్రత, శాంతి ఆధారపడి ఉంటాయని, అందు కోసమే ఎంత మంది సైనికులు చనిపోయారన్న అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ఓ మాజీ సైనికుడిగా, ప్రస్తుత మీడియా ప్రొఫెషనల్‌గా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ తెలిపారు. మిలిటరీలో మృతిచెందిన సైనికులకు అత్యున్నత గౌరవం ఇస్తారని, అయితే ఆ సమాచారాన్ని సరైన సమయంలో సమాజానికి తెలియజేస్తామని, ఆ రకంగా హీరోలను గౌరవిస్తామని గ్లోబల్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. 
logo