శనివారం 04 జూలై 2020
International - Jun 24, 2020 , 15:27:51

ఆ గొడ‌వ మా వైపున జ‌రిగింది: చైనా ర‌క్ష‌ణ‌శాఖ‌

ఆ గొడ‌వ మా వైపున జ‌రిగింది:  చైనా ర‌క్ష‌ణ‌శాఖ‌

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. జూన్ 15వ తేదీకి సంబంధించిన గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌పై ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది.  వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా వైపున ఉన్న భూభాగంలో జూన్ 15వ తేదీ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ట్లు పీఎల్ఏ వెల్ల‌డించింది. భార‌త ద‌ళాలు వాస్త‌వాధీన రేఖ‌ను దాటివ‌చ్చాయ‌న్న‌ది. ఆ రోజున జ‌రిగిన గొడ‌వ‌కు పూర్తి బాధ్య‌త భార‌త్‌దే అని పీఎల్ఏ పేర్కొన్న‌ది. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయిన ఘ‌ట‌న ప‌ట్ల తొలిసారి చైనా సైన్యం పూర్తి స్థాయి వివ‌ర‌ణ ఇచ్చింది.

గాల్వ‌న్ ఘ‌ట‌న‌పై చైనా ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తినిధి వూ కియాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  భార‌త‌, చైనా స‌రిహ‌ద్దు స‌మస్య‌లో.. బాధ్య‌త అంతా భార‌త్‌పైనే ఉంద‌ని ఆయ‌న అన్నారు. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతిని, స్థిర‌త్వాన్ని చైనా కాంక్షిస్తున్న‌ద‌న్నారు.  భార‌త్ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే ఆ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని భార‌త సైన్యం ఉల్లంఘించిన‌ట్లు చైనా ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తినిధి వూ కియ‌న్ తెలిపారు. గాల్వ‌న్ దాడి త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్న‌ట్లు చైనా ర‌క్ష‌ణ‌శాఖ వెల్ల‌డించింది. 

జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ట‌న షాక్‌కు గురి చేసింద‌ని,  భార‌త ద‌ళాలు ఎల్ఏసీ దాటి చైనా వైపుకు వ‌చ్చాయ‌ని, ఆ స్పాట్‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే.. చైనా ఆఫీస‌ర్లు, సైనికుల‌పై భార‌త ద‌ళాలు ఆక‌స్మికంగా దాడి చేశాయ‌ని, దీంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగార‌ని, దాని వ‌ల్ల సైనికులు చ‌నిపోయిన‌ట్లు వూ కియాన్ తెలిపారు. కానీ భార‌త్ మాత్రం ఈ వాద‌న‌ను తోసిపుచ్చుతున్న‌ది. చైనా ముంద‌స్తుగానే ప్లాన్ ప్ర‌కారం మ‌న సైన్యంపై దాడి చేసిన‌ట్లు భార‌త్ పేర్కొన్న‌ది. 
logo