మంగళవారం 07 జూలై 2020
International - Jun 07, 2020 , 02:41:51

ముప్పు పొంచే ఉంది..భారత్‌లో కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో

ముప్పు పొంచే ఉంది..భారత్‌లో కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో

  • దేశంలో వైరస్‌ ఇంకా విజృంభించలేదని వ్యాఖ్య

ఐరాస, జూన్‌ 6: కరోనా మహమ్మారి భారత్‌లో ఇంకా విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుడు వ్యాఖ్యానించారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైరస్‌ విజృంభించే ప్రమాదం పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీస్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖెల్‌ ర్యాన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో కేసుల రెట్టింపునకు మూడు వారాలు సమయం పడుతున్నదని చెప్పారు. కాబట్టి కరోనా ఉగ్రరూపం దాల్చకపోయినా, కేసులు క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో వైరస్‌ తీవ్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నదని.. పట్టణాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం ఉన్నదని తెలిపారు. దక్షిణాసియాలో భారత్‌లోనే కాకుండా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో కూడా వైరస్‌ ఇంకా విజృంభించలేదని, అయితే ఆ ముప్పు పొంచే ఉన్నదని చెప్పారు. ఏ క్షణమైనా వైరస్‌ తీవ్రరూపం దాల్చవచ్చని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ వంటి చర్యల వల్ల భారత్‌లో కరోనా వ్యాప్తి రేటు తగ్గిందని, అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేత వల్ల ప్రజల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో వైరస్‌ తిరిగి పుంజుకునే ప్రమాదం ఉన్నదని చెప్పారు. 

రెండు లక్షల కేసులు పెద్ద విషయం కాదు..

130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లో రెండు లక్షల కేసులు ఉండడం పెద్ద విషయం కాదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ వ్యాఖ్యానించారు. కరోనా వృద్ధి రేటు, రెట్టింపు రేటుపై దృష్టిసారించి కేసులు తీవ్రతరం కాకుండా కట్టడి చేయాలని సూచించారు. మరోవైపు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కరోనా సంక్షోభం భారత్‌కు ఒక అవకాశమని డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్‌ అధనోమ్‌ అభిప్రాయపడ్డారు.
logo