సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 18:17:20

బంగ్లాలో పురాతన కాళీ ఆలయం పునర్నిర్మాణం

బంగ్లాలో పురాతన కాళీ ఆలయం పునర్నిర్మాణం

ఢాకా :  బంగ్లాదేశ్‌ ఉత్తర నాటోర్‌ జిల్లాలో 300 సంవత్సరాల పురాతనమైన కాళీ ఆలయ పునర్నిర్మాణ పనులను భారత్‌ సోమవారం ప్రారంభించింది. ఇందుకు బంగ్లా కరెన్సీ (టాకా)లో రూ.97లక్షలు భారత ప్రభుత్వం కేటాయించగా, మొత్తం రూ.1.33కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. భారత ప్రభుత్వం హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ (హెచ్ఐసీడీపీ) కింద ఆలయ నిర్మాణం చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ రాష్ట్ర సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్, భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్, పార్లమెంట్‌ సభ్యుడు షఫీకుల్ ఇస్లాం, నాటూర్ మేయర్ ఉమా చౌదరి జాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాయబారి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని పురాతన దేవాలయాల్లో ఒకటైన కాళీ ఆలయ పునరుద్ధరణకు భారత హై కమిషన్‌ సహకరించినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇరుదేశాల ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.  బంగ్లా మంత్రి మాట్లాడుతూ ‘నాటోర్‌ను అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిర్మిస్తామని, స్నేహపూర్వక పొరుగు దేశం ఇండియా రాబోయే రోజుల్లో మన పక్షాన నిలబడుతుంది’ అన్నారు. కాగా, కాళీ మాతర్‌ ఆలయం బంగ్లాలోని నాటోర్‌లోని పురాతన ఆలయాల్లో ఒకటి. దీన్ని 18శ శతాబ్దం ప్రారంభంలో నాటోర్‌ రాణి భహాని దివాన్‌, దిఘాపియా రాయల్‌ ఫ్యామిలీ వ్యవస్థాపకుడు దయారామ్‌ రాయ్‌ నిర్మించారు. ఈ ఆలయంలో శివాలయం కూడా ఉంది. ఆలయంలో దుర్గా, కాళీ ఏటా ఉత్సవాల్లో పూజలందుకుంటున్నారు. రామకృష్ణ ఆలయ నిర్మాణానికి, శ్రీ ఆనందమోయి కాళీ మాత మందిర పునర్ధురణకు సైతం భారత్‌ నిధులు సమకూరుస్తోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo