శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 09, 2020 , 18:43:36

అమెరికాలో నిరుద్యోగ భృతికి 1.66 కోట్ల మంది దరఖాస్తు

అమెరికాలో నిరుద్యోగ భృతికి 1.66 కోట్ల మంది దరఖాస్తు

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచ ఆర్థికరంగంలో కల్లోలం సృష్టిస్తున్నది. అగ్రరాజ్యం అమెరికాలోనే నిరుద్యోగుల సంఖ్య దారుణంగా పెరుగుతున్నది. వైరస్ విజృంభించిన తర్వాత రికార్డు స్థాయిలో 1.66 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ. స్థూలంగా చెప్పాలంటే గత మూడువారాల్లో ప్రతి పదిమందిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. 1948 తర్వాత ఇంత వేగంగా, ఇంతటిస్థాయిలో ఉద్యోగాలు పోవడం అనేది ఒక రికార్డు. కరోనా వ్యాప్తి నివారణకు వ్యాపారాలు నిలిపివేసిన ఫలితంగా జాబ్ మార్కెట్ అల్లకల్లోలం అవుతున్నది. మొత్తంగా ఈ దెబ్బకు ఈనెల 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. ప్రస్తుత త్రైమాసికంలో ఉత్పాదన మూడోవంతు తగ్గిపోయింది. 48 రాష్ట్రాలు అత్యవసరం కాని వ్యాపారాలను మూసేశాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాలు, చిన్న వ్యాపారాలు కోట్లమందిని పనిలోంచి తీసేశాయి. ఆదాయం హరించుకుపోవడంతో వారంతా నెలవారీ బిల్లులు కట్టలేని పరిస్థితిలో పడిపోయారు. గత మూడు వారాల్లో మొత్తం 1.66 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ కార్యాలయాల్లో ఈ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇంకా మరిన్ని వస్తాయని భావిస్తున్నారు. మేలో ఉపాధి నివేదిక విడుదలయ్యే నాటికి నిరుద్యోగం 15 శాతానికి చేరుకోవచ్చని అంటున్నారు. మొత్తంగా 5 కోట్ల మంది, అంటే మూడోవంతు మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అందరూ నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోకపోవచ్చు. కానీ నిరుద్యోగం మాత్రం తారాస్థాయిని చేరడం మాత్రం ఖాయం.


logo