గురువారం 28 మే 2020
International - May 04, 2020 , 16:54:21

కరోనా లాక్‌డౌన్: బ్రిటన్‌లో చిన్నారుల ఆకలి కేకలు

కరోనా లాక్‌డౌన్: బ్రిటన్‌లో చిన్నారుల ఆకలి కేకలు

హైదరాబాద్: కరోనా కష్టాలు సంపన్న, నిరుపేద దేశాల్లో ఒకేతీరుగా ఉంటున్నాయి. ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల పరిస్థితి అంతటా దయనీయంగానే ఉంటున్నది. బ్రిటన్‌లో పిల్లలున్న కుటుంబాల్లో ఐదోవంతు అంటే సుమారు 20 శాతం లాక్‌డౌన్ కారణంగా పస్తులుంటున్నాయని తాజా డేటాను బట్టి తెలుస్తున్నది. రోజువారీ సంపాదన లేక, చేతిలో చిల్లిగవ్వ లేక గత ఐదువారాల్లో ఓ పూట తింటే ఓ పూట పస్తులు అన్నట్టుగా గడుపుతున్నారు. ముఖ్యంగా పెద్దకుటుంబాలు, సింగిల్ పేరెంట్ కుటుంబాలు, వికలాంగ పిల్లలున్న కుటుంబాలు తిండికి తీవ్రమైన కటకట ఎదుర్కొంటున్నాయి. తల్లిదండ్రుల్లో ఒక్కరు మాత్రమే ఉండే కుటుంబాలు 30 శాతం, అంగవైకల్యం కలిగిన పిల్లలున్న 46 శాతం కుటుంబాలు ఆహార అభద్రతకు గురవుతున్నాయి. కనీస పోషకావసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. బడులు మూసివేయడంతో ఉచిత అల్పాహారం, ఉచిత మధ్యాహ్న భోజనాలు కరువయ్యాయి. పేద కుటుంబాలకు ఎటూ పాలు పోవడంలేదు. ఇంటివద్దే ఉండిపోయిన బడులు తెరిచేంతవరకు వారానికి 15 పౌండ్ల ఆహార కూపన్లు సరఫరా చేసే కార్యక్రమం సమస్యలు ఎదుర్కొంటున్నది. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడంలో, సూపర్‌మార్కెట్లో వాటిని సమర్పించి ఆహారం పొందడంలో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు 6 లక్షల 21 వేల మంది పిల్లలు ఉదయం పూట ఉచిత అల్పాహారం పొందేవారు. ఇప్పుడు కేవలం లక్షా 36 వేలమంది మాత్రమే పొందగలుగుతున్నారు. ఇక స్కూలులో ఉచిత మధ్యాహ్న భోజనం పొందేవారిలో 31 శాతం పిల్లలు ఎలాంటి ప్రత్యామ్నాయం లేక ఆకలికి గురవుతున్నారు. ఇలా తిండిలేక ఇబ్బంది పడుతున్న పిల్లల సంఖ్య 5 లక్షల వరకు ఉంటుందని ఓ అంచనా. పలువురు సామాజిక కార్యకర్తలు ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.logo