బుధవారం 27 మే 2020
International - Apr 11, 2020 , 20:00:12

ఇటలీలో పేదలను ఆదుకుంటున్న మాఫియా

ఇటలీలో పేదలను ఆదుకుంటున్న మాఫియా

హైదరాబాద్: కల్లోల కరోనా కరకు గుండెల్లో కరుణను కూడా తట్టిలేపుతున్నది. ఇటలీలో నేరసామ్రాజ్యం నడిపే మాఫియా బాసులు కరోనా లాక్‌డౌన్ ఫలితంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆహారం పంచుతున్నారట. చేతిలో డబ్బులేక, బయట హోటళ్లు లేక జనం నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ ఇటలీలోని పేద రాష్ట్రాలైన కెంపానియా, కెలాబ్రియా, సిసిలీ, పగ్లియాలలో మాఫియా గ్యాంగులు అవసరార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వీడియోలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. నెలరోజులకు పైగా షాపులు, రెస్టారెంట్లు, పబ్బులు మూతపడ్డాయి. లక్షలాదిమంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తారు. అంటే వారికి నెలరోజులుగా ఆదాయం లేదు. ఎప్పుడు పనిలోకి వెళతామో కూడా వారికి తెలియదు. ప్రభుత్వం వారికి షాపింగ్ వోచర్లు పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వ సాయం అందకపోతే మాఫియా రంగంలోకి దిగి వారికి సాయం అందింది తనవైపు తిప్పుకుంటుందని యాంటీమాఫియా దర్యాప్తు అధికారి ఒకరు అన్నారు. ఇటలీలో 33 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారు దుకాణాదారులను ఉచితంగా సరుకులు ఇమ్మని బెదిరిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. బ్యాంకుల దగ్గరికి వెళ్లి ఎంతోకొంత సొమ్ము ఇవ్వమని కూడా వెంటపడుతున్నారట. ఈ పరిస్థితులు మాఫియా రంగప్రవేశానికి అనువుగా ఉంటాయని వేరే చెప్పాలా?


logo