బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 12:09:56

బ్రెజిల్‌లో కరోనాతో మరోరకం సమస్య

బ్రెజిల్‌లో కరోనాతో మరోరకం సమస్య

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని జబ్బుకు గురిచేసి వేలమందిని బలిగొంటుంటే కొందరు నేతలు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వ్యవహరిస్తుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. మలేరియా మందు గురించి అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్నపిల్లాడిలా మంకుపట్టి ఇండియా మీద కేకలు వేయడం చూస్తున్నాం. అసలు ఆ మందు కరోనాకు పనికివస్తుందని వైద్యరంగం ఇప్పటిదాకా ధ్రువీకరించనేలేదు. కానీ ఆ మందునే వాడాలని వైద్యరంగంతో ఏమాత్రం సంబంధం లేని ట్రంప్ మొండిగా వాదిస్తున్నాడు. పైగా ఆ మందు అమెరికా వద్ద తగినంతగా లేదు. భారత్ వద్ద మాత్రం దండిగా ఉన్నది. అది తనకు కావాలని అడగడం, ఆ తర్వాత బెదిరింపులకు దిగడం భారత్ కు తలనొప్పిగా పరిణమించింది. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో మరోకరం మొండి వైఖరితో దడిపిస్తున్నారు. అసలు కరోనా పెద్ద జబ్బేమీ కాదని, దానికి లాక్‌డౌన్ అవసరమే లేదని ఆయన అంటున్నారు. ఇదంతా మామూలు జలుబే అని కొట్టిపారేస్తున్నారు. పైగా ప్రజలను మామూలుగా బయటకు వచ్చి తమ పనులు తాము చేసుకోవాలని రెచ్చగొడుతున్నారు. తానూ స్వయంగా వీధుల్లోకి వెళ్లి అభిమానులను రాసుకుని తిరుగుతున్నారు. ఇది సహజంగానే భయాందోళనలు కలిగించే విషయమే. కానీ అదృష్టం ఏమంటే బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు బోలెడు అధికారాలు ఉన్నాయి. ఆరోగ్యం వంటి కొన్ని విషయాల్లో అధ్యక్షుని కాదని వ్యవహరించే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్లు ఆ పనే చేస్తున్నారు. దేశంలోని 27 మంది గవర్నర్లలో 24 మంది అధ్యక్షుని ధిక్కరించి కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. బ్రెజిల్ గవర్నర్లలో ఇప్పటి స్థాయిలో ఐక్యత గతంలో ఎన్నడూ కనిపించలేదనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అధ్యక్షుని బేఖాతరు చేస్తూ గవర్నర్లు సొంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు అమలు చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. 


logo