శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 17:40:12

ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్.. ఎవ‌రికి ఇవ్వొచ్చు ?

ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్.. ఎవ‌రికి ఇవ్వొచ్చు ?

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న‌వారు అదృష్ట‌వంతులే.  వారి రోగ‌నిరోధ‌క శ‌క్తి దృఢంగా ఉన్న‌ట్లే. కానీ రెండ‌వ‌సారి వారికి మ‌ళ్లీ వైర‌స్ సంక్ర‌మించ‌ద‌న్న గ్యారెంటీ మాత్రం లేదు.  రెండ‌వ‌సారి మ‌ళ్లీ వైర‌స్ అటాక్ చేస్తే.. అప్పుడు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ వాళ్ల‌ను కాపాడుతుందా లేదా అని చెప్ప‌లేం.  యాంటీబాడీల నుంచి సెకండ్ ఇన్‌ఫెక్ష‌న్ సోకుండా ఉంటుందా అన్న అంశంపై ప్ర‌స్తుతం ఎటువంటి ఆధారాలు లేవ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. వైర‌స్‌ను జ‌యించిన వారిలో యాంటీబాడీలు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప‌నిచేస్తాయి. కానీ రెండవ‌సారి వైర‌స్ సోకితే ఏంట‌న్న‌ది మాత్రం డ‌బ్ల్యూహెచ్‌వో కూడా చెప్ప‌లేక‌పోతున్న‌ది.  దీనిపై స్ట‌డీ జ‌రుగుతున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. 

SARS-CoV-2పై పోరాడి గెలిచిన వారికి ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చా లేదా అన్న ప్ర‌శ్నఇప్పుడు త‌లెత్తుతున్న‌ది.  ఒకసారి వ్యాధి వ‌చ్చి కోలుకున్న వారికి రిస్క్ ఫ్రీ స‌ర్టిఫికెట్ ఇస్తే.. వారు ఇక ఉద్యోగానికి వెళ్ల‌వ‌చ్చు. ప్ర‌యాణాల‌కు కూడా వాళ్లు అర్హులు.  కానీ కోవిడ్ నుంచి కోలుకుని, యాంటీబాడీలు ఉన్న‌వారికి మ‌ళ్లీ వైర‌స్ సోక‌ద‌న్న దానిపై మాత్రం క్లారిటీ లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెబుతున్న‌ది.  స‌హ‌జసిద్ద‌మైన సంక్ర‌మ‌ణ‌కు ఇమ్యూనిటీ డెవ‌ల‌ప్ అయ్యే ప‌ద్ధ‌తి బ‌హుళ ద‌శ‌ల్లో జ‌రుగుతుంది. అది క‌నీసం ఒక‌టి నుంచి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంది. వైర‌స్ ప్ర‌గ‌తిని అడ్డుకునేందుకు శ‌రీరంలోని ఉన్న మాక్రోఫేజ‌స్‌, న్యూట్రోఫిల్స్‌, డెండ్రిటిక్ సెల్స్ తొలుత రియాక్ట్ అవుతాయి. వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌కుండా ఉండేందుకు ఈ క‌ణాలు శ‌రీరానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. ఈ ద‌శ‌లోనే శ‌రీరంలో వైర‌స్‌కు వ్య‌తిరేకంగా యాంటీబాడీలు త‌యార‌వుతాయి. వీటినే ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రోటీన్లు అంటారు.

వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల గురైన క‌ణాల‌ను గుర్తించి, వాటిని చంపేసే టీ-సెల్స్ కూడా శ‌రీరంలో త‌యార‌వుతాయి. దీన్నే వైద్య‌భాష‌లో సెల్యూలార్ ఇమ్యూనిటీ అంటారు.  ఇలా శ‌రీరంలో ఉన్న ర‌క‌ర‌కాల క‌ణాలు, ప్రోటీన్లు.. వైర‌స్‌తో పోరాడుతాయి. ఒక‌వేళ ఆ  క‌ణాలు బ‌లంగా రియాక్ట్ అయితే, అప్పుడు రీఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కానీ ర‌క్తంలో ఉన్న యాంటీబాడీల‌ను లెక్కించిన త‌ర్వాత‌నే ఈ ప‌ద్ధ‌తికి పూర్తి మార్కులు వేయ‌డం వీల‌వుతుంది.  రెండోసారి వైర‌స్ సోకిన వారికి ఇమ్యూనిటీ ఎలా ప‌నిచేస్తుంద‌న్న దానిపై ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది. యాంటీబాడీలు త‌క్కువ స్థాయిలో ఉన్న‌వారు మ‌ళ్లీ కోలుకోవ‌డం కొంత ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారికి సెల్యూలార్ ఇమ్యూనిటీ కీల‌కంగా మార‌నున్న‌ది. యాంటీబాడీల‌తో ఇమ్యూనిటీ శాశ్వ‌తంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని ఇంకా నిర్ధారించ‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెబుతున్న‌ది. 

క‌రోనా వైర‌స్‌లు ఆరు ర‌కాలు ఉన్న‌ట్లు గుర్తించారు.  ఇందులో నాలుగు ర‌కాల వైర‌స్‌ల వ‌ల్ల కేవ‌లం సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంది. ఇవి ఎక్కువ‌గా స‌ర్య్యూలేట్ అవుతుంటాయి. ఇక మిగితా రెండు క‌రోనా వైర‌స్‌ల వ‌ల్ల మెర్స్‌, సార్స్ వ్యాధులు వ‌స్తాయి. ఈ వ్యాధులు వ‌చ్చిన వారిలో ఉన్న యాంటీబాడీలతో పాటు నోవెల్ క‌రోనా యాంటీబాడీలు కూడా ఉంటే వారికి ఎటువంటి స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు. యాంటీబాడీలు ఎంత స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయో తెలియ‌ద‌ని, వాటి ఆధారంగా ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్ ఇవ్వ‌లేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో స్ప‌ష్టం చేసింది.  రెండ‌వ‌సారి  వైర‌స్ సంక్ర‌మించ‌ద‌న్న విశ్వాసంతో ఉన్న‌వారి వ‌ల్ల వైర‌స్ ట్రాన్స్‌మిష‌న్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. 




logo