గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 21, 2020 , 17:18:27

ఒక‌సారి క‌రోనా వ‌స్తే మళ్లీ రాదా?

ఒక‌సారి క‌రోనా వ‌స్తే మళ్లీ రాదా?

లండ‌న్‌: ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వ్య‌క్తి మ‌ళ్లీ క‌నీసం ఆరు నెల‌ల పాటు దాని బారిన ప‌డ‌బోర‌ని తాజా అధ్య‌య‌నం తేల్చింది. క‌రోనాపై పోరాడుతున్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌పై చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్ రీసెర్చర్లు ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న 5 కోట్ల‌కుపైగా బాధితుల‌కు ఇది కాస్త ఊర‌ట క‌లిగించే విష‌య‌మే. ఇది నిజంగా శుభ‌వార్తే. క‌నీసం కొంత కాలానికైనా మ‌ళ్లీ క‌రోనా రాదు అన్న విశ్వాసం బాధితుల‌కు క‌లుగుతుంది అని ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న ఆక్స్‌ఫ‌ర్డ్ ప్రొఫెస‌ర్ డేవిడ్ ఐర్ అన్నారు. ఒక‌సారి క‌రోనా బారిన ప‌డిన వాళ్లలో అక్క‌డ‌క్క‌డా కొంత‌మందికి మ‌రోసారి కూడా ఈ వైర‌స్ సోక‌డం చాలా మందిని ఆందోళ‌న‌లోకి నెట్టింది. రోగ నిరోధ‌క శ‌క్తి కొంత‌కాల‌మే ఉంటుందా అన్న అనుమానాల‌కు తావిచ్చింది. అయితే తాజా అధ్య‌య‌న ఫ‌లితాలు వారికి ఊర‌ట క‌లిగించేవే. 

ఒక‌సారి వైర‌స్ సోకిన వారికి మ‌ళ్లీ సోకే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని ఈ అధ్య‌య‌నం తేల్చింది. క‌నీసం ఆరు నెల‌లైనా మ‌ళ్లీ సోకే అవ‌కాశం ఉండ‌ద‌ని డేవిడ్ ఐర్ స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ నుంచి న‌వంబ‌ర్ మ‌ధ్య కాలంలో 30 వారాల పాటు హెల్త్ వ‌ర్క‌ర్ల‌పై ఈ అధ్య‌య‌నం సాగింది. ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను MedRxivలో ప్ర‌చురించారు. 11,052 మంది స్టాఫ్ మెంబ‌ర్స్‌లో యాంటీబాడీస్ లేని 89 మందిలో ల‌క్ష‌ణాల‌తో కూడిన ఇన్ఫెక్ష‌న్ క‌నిపించింది. ఇక యాంటీబాడీస్ క‌లిగి ఉన్న‌ 1246 మందిలో ఏ ఒక్క‌రూ మ‌ళ్లీ ఈ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌లేదు. యాంటీ బాడీస్ ఉన్న వాళ్లు లక్ష‌ణాలు లేని క‌రోనా బారిన ప‌డే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌ని ఈ అధ్య‌య‌నం తేల్చింది. త‌మ అధ్య‌య‌నాన్ని కొన‌సాగిస్తామ‌ని, ఒక‌సారి వైర‌స్ సోకిన వారికి గ‌రిష్ఠంగా ఎంత‌కాలం పాటు ర‌క్ష‌ణ ఉంటుందో తెలుసుకుంటామ‌ని డేవిడ్ ఐర్ చెప్పారు.