మంగళవారం 19 జనవరి 2021
International - Dec 16, 2020 , 00:57:15

కంటెంట్‌ కరెక్ట్‌గా లేకపోతే ‘కోస్తాం’!

కంటెంట్‌ కరెక్ట్‌గా లేకపోతే ‘కోస్తాం’!

  • టెక్‌ కంపెనీలకు బ్రిటన్‌ హెచ్చరిక

లండన్‌: ‘టెక్‌ కంపెనీలూ... తస్మాత్‌ జాగ్రత్త’ అని హెచ్చరిస్తున్నది బ్రిటన్‌ ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను నియంత్రించకపోతే టెక్‌ కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. ఈ వడ్డన 1.8 కోట్ల పౌండ్లు (రూ.177.24 కోట్లు) లేదా ఆ సంస్థ గ్లోబల్‌ టర్నోవర్‌లో 10 శాతం వరకు ఉంటుంది. ఈ మేరకు బ్రిటన్‌ కొత్త చట్టాన్ని తీసుకురానుంది. సోషల్‌ మీడియా సైట్లు, వెబ్‌సైట్లు, యాప్‌లు, యూజర్లు పోస్టుచేసే కంటెంట్‌ను నిర్వహించే, ఆన్‌లైన్‌లో ప్రజలు పరస్పరం మాట్లాడుకునేందుకు వీలు కల్పించే సర్వీసులు కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం ప్రకారం పిల్లల అసభ్య, అశ్లీల చిత్రాలు, ఉగ్రవాదంవైపు, ఆత్మహత్యకు పురిగొల్పే విషయాల వంటి చట్ట వ్యతిరేక కంటెంట్‌ను టెక్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు, నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి.