మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 10:03:32

నేను గెలిస్తే.. హెచ్‌1బీ వీసాల‌పై నిషేధాన్ని ఎత్తేస్తా: బైడెన్

నేను గెలిస్తే.. హెచ్‌1బీ వీసాల‌పై నిషేధాన్ని ఎత్తేస్తా: బైడెన్

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. బైడెన్ ఓ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఒక‌వేళ తాను అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిస్తే, భార‌త్‌తో బంధాన్ని బ‌లోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్య‌త ఇస్తాన‌న్నారు.  హెచ్‌1బీ వీసాల‌పై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని కూడా ఎత్తివేస్తాన‌ని జోసెఫ్ బైడెన్ తెలిపారు. అమెరికాకు భార‌త్ స‌హ‌జ భాగ‌స్వామి అని, త‌మ ప్ర‌భుత్వం ఆ దేశానికి అత్యున్న‌త ప్రాధ‌న్యత క‌ల్పిస్తుంద‌న్నారు. మా భ‌ద్ర‌త, వారి భ‌ద్ర‌త‌ దృష్ట్యా .. భార‌త్‌తో బంధం కీల‌క‌మైంద‌న్నారు.  

భార‌త్‌తో భాగ‌స్వామ్యం, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కీల‌క‌మే కాదు, అత్యంత ముఖ్య‌మైంద‌ని కూడా బైడెన్‌ తెలిపారు.  ఒబామా పాల‌న‌లో అమెరికా  మాజీ ఉపాధ్య‌క్షుడిగా ఎనిమిదేళ్ల పాటు బైడెన్ బాధ్య‌త‌లు నిర్వర్తించారు. ద‌శాబ్ధం క్రితం ‌అమెరికా, భార‌త్ మ‌ధ్య పౌర అణు ఒప్పందం కుద‌ర్చ‌డంలో తాను పాత్ర పోషించిన‌ట్లు బైడెన్‌ తెలిపారు. తానెప్పుడూ ఇండియాకు పెద్ద మ‌ద్ద‌తుదారుడినే అని తెలిపారు. న‌వంబ‌ర్ ఎన్నిక‌లు చాలా కీల‌క‌మ‌ని, అది అమెరికా ఆత్మ కోసం జ‌రుగుతున్న పోరాట‌మ‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా వైర‌స్‌ను ట్రంప్ స‌ర్కార్ ఎదుర్కొన్న తీరును బైడెన్ త‌ప్పుప‌ట్టారు.


logo