బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 21:32:44

కయ్యానికి చైనా కాలుదువ్వితే.. మన బలమేంటి?

కయ్యానికి చైనా కాలుదువ్వితే.. మన బలమేంటి?

న్యూఢిల్లీ : గల్వాన్‌ ఘర్షణతో చైనా- భారత్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రెండు దేశాల బలాబలాలపై చర్చ జరుగుతున్నది. యుద్ధం అంటూ వస్తే ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనతలు ఏమిటి? అన్నది చర్చనీయాంశంగా మారుతున్నది. ఒక వేళ చైనాతో యుద్ధంలో తలపడితే భారత్‌ విజయావకాశాలు ఎలా ఉంటాయి? ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగివున్న చైనాను భారత్ ఢీకొట్టగలదా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. చైనా నుంచి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో భారత్‌ తన స్థానాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం భారత్ కూడా సరిహద్దులో క్షిపణులను మోహరించింది. 

డ్రాగన్‌ అనుభవం అంతంతే

చైనా సైన్యం కవాతు పరిశీలించిన వారికి డ్రాగన్ సైన్యం మహా పటిష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చైనా ఆర్మీ యుద్ధ భూమిలో దిగితే ప్రత్యర్థులు చిత్తు కావడం ఖాయమన్న భావన కలుగుతున్నది. అయితే, ఇదంతా పైకి కనిపిస్తుండగా.. లోపల వీరికంత సీన్ లేదనే విషయం బయటపడుతున్నదని నిపుణులు చెబుతున్నారు.  చైనా సైన్యంలో ప్రస్తుతం ఉన్న జవాన్లకు యుద్ధంలో పాల్గొన్న అనుభవం లేదట. నిజంగా యుద్ధం వస్తే ప్రత్యర్థిని ఎదుర్కొని వీరు నిలబడగలరా అన్నది ప్రశ్నార్థకమే.

యుద్ధ భూమిలో చైనా గత అనుభవాలు ఏమంత గొప్పగా లేవు. 1950 లో అమెరికన్ జనరల్ డగ్లస్ మెక్ కార్తర్ సేనను లొంగదీసుకున్నామని చెప్పే డ్రాగన్ సైన్యం.. ఆ తర్వాత పట్టు కోల్పోయింది. 1979లో వియత్నాం యుద్ధ సమయంలో చావు దెబ్బతిన్నది. ఆ యుద్ధంలో చైనాకు చెందిన 62 వేల మంది సైనికులను చంపామని వియత్నాం ప్రకటించుకుంది. మరో విషయం ఏంటంటే.. చైనా సైన్యంలో అవినీతి, అనైతికత పెరిగిపోయాయని విశ్లేషకులు చెప్తున్నారు.

అప్రమత్తంగా భారత్‌

ఒకవైపు చర్చలంటూ చైనా కాలయాపన చేస్తుండగా.. మరోవైపు ఆ దేశ మిలిటరీ సరిహద్దుల్లో యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నది. వారి కదలికలను పసిగట్టిన భారత్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. దాదాపు 20 వేల మంది చైనా సైనికులు భారత సరిహద్దుల్లో చేరుకోగా.. భారత్‌ కూడా అంతే వేగంగా స్పందించి సరిహద్దులకు మన శతఘ్నులను, యుద్ధ ట్యాంకులను తరలిస్తున్నది.


రెండు దేశాల బలాబలాలు

2019 లెక్కల ప్రకారం.. డిఫెన్స్ బలగాల కోసం చైనా 261 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుండగా.. ఇండియా 71.1 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నది.

చైనా సైనికులు 2-2.3 లక్షల మంది ఉంటుండగా.. ఇండియా సైనికులు 2.25 లక్షలుగా ఉన్నారు. వెస్టర్న్ థియేటర్ కమాండ్, టిబెట్, జిన్ జియాంగ్ మిలిటరీ జిల్లాల ప్రాంతాల్లో చైనా ఆర్మీని మోహరించింది. ఇందులో ఎక్కువ భాగం జిన్ జియాంగ్, టిబెట్‌లో తిరుగుబాటు ఎదుర్కోవడానికే ఉద్దేశించిందనేది నిపుణుల అభిప్రాయం. మరోవైపు ఈ బలగాల్లోని అత్యధిక భాగం భారత సరిహద్దు నుంచి దూరంగా ఉన్నాయి. 

యుద్ధ సామగ్రి మొహరింపు

టీ-72 ట్యాంక్‌కు అనుబంధంగా 3 వేల మంది, లడాఖ్‌లో మొహరించిన అరుణాచల్‌ప్రదేశ్‌లోని బ్రహ్మాస్ క్రూయిజ్ మిస్సైల్‌కు అనుబంధంగా వేయి మంది ఉన్నారు. చైనా సరిహద్దు నార్తన్ కమాండ్‌లో 34 వేల దళాలు, సెంట్రల్ కమాండ్‌లో 15,500 దళాలు, ఈస్టర్న్ కమాండ్‌లో 1,75, 500 దళాలు మొహరించాయి.

స్టాటెజిక్ పోస్టర్ ఆఫ్ చైనా అండ్ ఇండియా నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన యుద్ధ విమానాల్ని నడిపే వెస్టర్న్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్, పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్ లు భారత సరిహద్దుకు సమీపంలో ఉన్నా సరే.. సంఖ్యాపరంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తో ఇబ్బంది తప్పకపోవచ్చు. చైనాకు చెందిన మూడు కమాండ్‌లను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాదాపు 270 యుద్ధ విమానాల్ని, 68 గ్రౌండ్ ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సిద్దం చేసింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

పైచేయి ఎవరిదంటే...

పశ్చిమ వాయు విభాగంలో 75 యుద్ధవిమానాల్ని, 34 గ్రౌండ్ ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌లను టిబెట్‌కు సమీపంలో సిద్ధంగా ఉంచారు. తూర్పు వాయు విభాగంలో 101 యుద్ధ విమానాలు, 9 ఏఎల్జీ మొహరించారు. రెండు దేశాల వైమానిక దళాల్ని పరిశీలిస్తే చైనాకు చెందిన జే10 యుద్ధ విమానం సాంకేతికంగా ఇండియాకు చెందిన మిరేజ్ 2000ను పోలి ఉంటుంది. భారత్‌కు చెందిన  సు-30ఎంకేఐ మాత్రం చైనాకు చెందిన అన్ని యుద్ధవిమానాల కంటే శక్తివంతమైనది. అటు చైనా నాలుగో తరానికి చెందిన 101 యుద్దవిమానాల్ని రష్యా, భారత్‌ల కోసం మొహరించగా.. ఇండియా మాత్రం మొత్తం 122 యుద్ధవిమానాల్ని కేవలం చైనా లక్ష్యంగా సిద్ధంగా ఉంచింది. ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్‌లో సామర్ధ్యాన్ని కలిగి, గ్రౌండ్ ఎటాక్ చేయగలగిన 50 డ్రోన్లను ఇప్పటికే ఇండియాకు వ్యతిరేకంగా మొహరించడం ద్వారా  చైనా ఈ విషయంలో పైచేయి సాధించిందని చెప్పవచ్చు.

రీజినల్ ఎయిర్ పొజిషన్‌లో ఎక్కువ ఎయిర్ ఫీల్డ్స్‌తో చైనా కంటే శక్తివంతంగా భారత్‌ ఉన్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది. 104 చైనా మిస్సైళ్లు ఇండియాలోని ప్రతి భాగాన్ని లక్ష్యం చేసుకోగలవని కూడా ఈ నివేదిక చెప్తున్నది. ఇండియాకు చెందిన పది అగ్ని-3 లాంచర్లు.. మొత్తం చైనాను టార్గెట్ చేసే శక్తి కలిగివున్నవి. భారత అమ్ములపొదిలో సీ17 గ్లోబ్ మాస్టర్, సీ130 సూపర్ హెర్క్యూలెస్, సీహెచ్47 షినూక్ ఎంఐ 17 హెలిక్యాప్టర్లు ఉన్నాయి. డీఆర్డీవో రూపొందించిన అస్త్ర క్షిపణి మన బలాన్ని పెంపొందిస్తున్న మరో ఆయుధం. 

శక్తివంతమైన సైన్యం భారత్‌ది: అమెరికా

క్షేత్రీయ సైన్యంగా ప్రారంభమైన భారత సైన్యం ఇప్పుడు ఏకంగా ప్రపంచస్థాయిలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఎదుగుతోందని అమెరికా తెలిపింది. ఇండియన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ట్రాన్సఫర్మేషన్ అనే పత్రాన్ని అమెరికా ఆర్మీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన స్ట్రాటజిక్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లోని బ్రాయన్ హెండ్రిక్ సమర్పించారు. ఈ పత్రంలో భారతదేశానికి చెందిన సైన్యం ప్రపంచస్థాయిలో అత్యంత శక్తివంతమైన సైనికశక్తిగా ఎదుగుతున్నదని, ఇది ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆయన తన పత్రంలో వివరించారు.

ప్రస్తుతం భారతదేశానికి చెందిన సైన్యం చాలా త్వరగా మార్పులు చేసుకుంటున్నదని, ఆ దేశానికి చెందిన సైన్యం అత్యంత ఆధునిక ఆయుధాలను రూపొందించుకుని అమెరికాతోపాటు మరిన్ని దేశాలకు దీటుగా తయారవుతుందని ఎస్ఎస్ఐ డైరెక్టర్ డగ్లస్ లవలెస్ సమర్పించిన పత్రంలో పేర్కొన్నారు.

హోవర్డ్ కెన్నెడీ స్కూల్ నివేదిక ప్రకారం.. భారత్, చైనాల మధ్య యుద్ధం తలెత్తితే  చైనా సైన్యాన్ని భారత ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుంది. హిమాలయ పర్వతశ్రేణుల్లో జరిగే యుద్ధంలో చైనా ఆర్మీని భారత సైన్యం ఓడించగలదని.. అంతేకాకుండా సైనిక సామర్ధ్యం విషయంలో చైనా కంటే ఇండియా వెనుకబడి ఉన్నదన్న నిపుణుల అంచనా తప్పని రుజువు చేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

అవసరాన్ని బట్టి దౌత్యవిధానంలో దూకుడు ప్రదర్శించాలా.. లౌక్యంగా ఉండాలా.. ఎవరితో ఎలాంటి విధానాలు అనుసరించాలి? అన్న అంశాలను భారత్‌ అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నది. 


logo