మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 00:56:23

రోహింగ్యాలపై నరమేధాన్ని ఆపండి

రోహింగ్యాలపై నరమేధాన్ని ఆపండి
  • మయన్మార్‌కు అంతర్జాతీయ కోర్టు ఆదేశం

హేగ్‌: రోహింగ్యా ముస్లిం మైనార్టీల న్యాయపోరాటానికి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఘనవిజయం లభించింది. రో హింగ్యాలపై జరుగుతున్న నరమేధాన్ని అడ్డుకొనేందుకు అధికారికంగా అన్ని చర్యలు చేపట్టాలని ఐసీజే గురువారం మయన్మార్‌ను ఆదేశించింది. మయన్మార్‌లో రోహింగ్యాలకు తీవ్రమైన ముప్పు ఉన్నట్టు అభిప్రాయపడుతున్నట్లు ఐసీజే ప్రెసిడెంట్‌, జడ్జి అబ్దుల్‌కావీ అహ్మద్‌ యూసఫ్‌ తెలిపారు. రోహింగ్యాల  రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలన్న తమ ఆదేశానికి మయన్మార్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, ఇది మయన్మార్‌ నిర్వర్తించాల్సిన అంతర్జాతీయ బాధ్యత అని ఐసీజే స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతున్నందున ఐసీజే తీర్పును పాటించేందుకు చేపట్టిన చర్యలేమిటో 4 నెలల్లో తెలియజేయడంతోపాటు ప్రతి 6 నెలలకోసారి నివేదిక సమర్పించాలని ఐసీజే ఆదేశించింది. ఐసీజే ఆదేశాన్ని మానవహక్కుల కార్యకర్తలు స్వాగతించారు. రోహింగ్యాలపై నరమేధం నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మయన్మార్‌ను ఐసీజే ఆదేశించడం చరిత్రాత్మకమని, రోహింగ్యాలపై మరిన్ని అకృత్యా లు జరుగకుండా నిరోధించేందుకు ఇది ఎం తో దోహదపడుతుందని న్యూయార్క్‌లోని మానవహక్కుల నిఘా సంస్థలో అసోసియేట్‌ ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పరమ్‌ ప్రీత్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.
logo