మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 18, 2020 , 02:31:33

ఐ లవ్‌ ఇండియా

ఐ లవ్‌ ఇండియా

  • ఎన్ని సమస్యలున్నా భారత్‌ నిలబడింది
  • విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంది
  • రామాయణ, మహాభారతాలు వింటూ పెరిగాను
  • గాంధీజీ నా మార్గదర్శి.. ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకంలో ఒబామా 

వెల్లడివాషింగ్టన్‌: భారత్‌పై ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. అనేక అంశాల్లో భారత్‌ ఒక విజయ ప్రస్థానాన్నే లిఖించిందన్నారు. మహాత్ముడి జీవితం తనను ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటి (2009-2017) తన జ్ఞాపకాలను ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' అనే పుస్తకంలో 768 పేజీలుగా ఒబామా పొందుపరిచారు. ‘క్రౌన్‌ పబ్లిషింగ్‌ గ్రూప్‌' సంస్థ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనున్నది. తొలి భాగం  ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' మంగళవారం విడుదలైంది.

ఇతిహాసాలు వింటూ పెరిగా

బాల్యమంతా ఇండోనేషియాలో గడిచింది. రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగా. ఈ కారణంగా భారత్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ప్రపంచ జనాభాలో ఆరో వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే వారితో భారతదేశం పరిపూర్ణమైంది. 2010లో అధ్యక్ష పర్యటనకు ముందు వరకు నేను భారత్‌కు ఎప్పుడూ వెళ్ళలేదు.

దాల్‌, కీమా వండటం అలవాటయ్యింది

తూర్పు దేశాల్లోని మతాల పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. కళాశాల విద్యనభ్యసిస్తున్నప్పుడు పాకిస్థాన్‌, భారత్‌కు చెందిన పలువురు స్నేహితులు ఉండేవారు. వారి వల్లనే దాల్‌ (పప్పు), కీమా వండటం అలవాటయ్యింది. బాలీవుడ్‌ సినిమాల పట్ల కూడా ఆకర్షితుడినయ్యా.

ఆధునిక భారత్‌ విజయవంతమైన దేశం

రాజకీయపరమైన వైరుధ్యాలు, సాయుధ వేర్పాటువాద ఉద్యమాలు, అవినీతి కుంభకోణాలు జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ, ప్రజాస్వామ్య దేశమైన ఆధునిక భారత్‌కు ఒక విజయవంతమైన చరిత్ర ఉన్నదని చెప్పగలను. 1991లో ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు వృద్ధి రేటు పరుగులు తీసేలా చేశాయి. సిక్కు మైనార్టీ వర్గం నుంచి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని పదవి చేపట్టే స్థాయికి ఎదిగారు. దేశ ఆర్థిక పరివర్తనకు, వృద్ధికి ఆయన చిహ్నంగా నిలిచారు.   

విజయానికి  బాటలు వేశారు

భారత్‌పై నాకు ఇష్టం పెరుగడానికి మహాత్మా గాంధీ ప్రధాన కారణం. అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలతో పాటు గాంధీ నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేశారు. ఓ విధంగా నా విజయానికి  బాటలు వేశారు. సత్యం, సత్యాగ్రహం, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన గాంధీ.. అమెరికాలోని నల్లజాతీయుల పోరాటానికి మార్గనిర్దేశం చేశారని చెప్పొచ్చు.

లాడెన్‌ను ఇలా మట్టుబెట్టాం

అబొట్టాబాద్‌లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్‌ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్‌ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్‌పై దాడి చేయడానికి రెండు అవకాశాలున్నాయి. మొదటిది.. లాడెన్‌ ఉన్న కాంపౌండ్‌ను వైమానిక దాడులతో ధ్వంసం చేయాలి. రెండోది.. ప్రత్యేక కమెండో ఆపరేషన్‌. రిస్క్‌ ఉన్నప్పటికీ నేను, జాతీయ భద్రతా బృందం రెండో అవకాశాన్ని ఎంచుకున్నాం. అయితే ఈ ఆపరేషన్‌ను ఆమోదించడానికి ఒకరోజు ముందు సమావేశంలో రక్షణ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌, ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ దీనిని వ్యతిరేకించారు. చివరకు కమెండో ఆపరేషన్‌ విజయవంతమైంది. 

భారత్‌ ఓ విజయవంతమైన దేశం. నాకు ఎంతో ఇచ్చింది
రామాయణ, భారతాల్లోని పరమార్థాన్ని తెలియజెప్పింది
మహాత్ముడి శాంతి బోధనలతో నా విజయానికి బాటలు వేసింది
దాల్‌, కీమా రుచులతోపాటు బాలీవుడ్‌ సినిమాల వినోదాన్ని పంచింది      - అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా