శనివారం 11 జూలై 2020
International - Jun 04, 2020 , 02:08:40

ట్రంప్‌తో విభేదించిన అమెరికా రక్షణ మంత్రి

ట్రంప్‌తో విభేదించిన అమెరికా రక్షణ మంత్రి

  • అత్యవసర పరిస్థితుల్లోనే మిలిటరీని మోహరించాలని వ్యాఖ్య 
  • దేశంలో శాంతియుతంగా నిరసనలు

వాషింగ్టన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌ దారుణ హత్య అనంతరం అమెరికాలో చెలరేగిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని దించుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలతో ఆ దేశ రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ విభేదించారు. మిలిటరీని దించేందుకు అనుమతించే ‘తిరుగుబాటు చట్టాన్ని’ అత్యవసర, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడే వినియోగించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఫ్లాయిడ్‌ పట్ల మినియాపొలిస్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది హత్య, దారుణమైన నేరమని వ్యాఖ్యానించారు. కాగా, అల్లర్లతో దెబ్బతిన్న చర్చి వద్దకు ట్రంప్‌తో కలిసి వెళ్లడంపై ఎస్పర్‌ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీనిపై ఆయన స్పందిస్తూ.. చర్చి వద్దకు వెళ్తున్నట్లు తనకు తెలుసునని, అయితే అక్కడ అధ్యక్షుడు ట్రంప్‌ ఫొటో దిగే విషయం తనకు తెలియదని చెప్పారు. అంతకుముందు అక్కడి సమీపంలోని పార్కు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టిన విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. మరోవైపు, నిరసనల విషయంలో ట్రంప్‌ మాత్రం దూకుడును కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్‌లో పెద్ద ఎత్తున నేషనల్‌ గార్డ్‌ బలగాలను మోహరించడంపై ఆయన స్పందిస్తూ.. హింసను ఏ విధంగా నియంత్రించాలో రాష్ర్టాలకు ఇది ఒక మోడల్‌ అని వ్యాఖ్యానించారు. ‘సమస్యాత్మక ప్రాంతాలు రిపబ్లికన్ల పాలనలో లేవన్న విషయాన్ని గుర్తించాలి. డెమోక్రాట్లే వాటిని పాలిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

శాంతియుతంగా ఆందోళనలు..

ఫ్లాయిడ్‌ హత్యానంతరం అమెరికాలో చెలరేగిన హింసాత్మక నిరసనలు బుధవారం శాంతించాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. న్యూయార్క్‌లో మాత్రం కొన్ని చోట్ల లూటీలు జరిగాయి. బుధవారం ఉదయం వరకు సుమారు 9 వేల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూయార్క్‌లో చోటుచేసుకున్న దోపిడీ ఘటనలు సిగ్గుచేటని, క్షమించరానివని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో వ్యాఖ్యానించారు. నగర పోలీస్‌ విభాగం, మేయర్‌ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. 

ట్రంప్‌ .. నోరు మూసుకో

అల్లర్లు అదుపుచేయడంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరును హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అసెవెడో తీవ్రంగా విమర్శించారు. సైన్యాన్ని మోహరిస్తానన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘దేశంలోని పోలీస్‌ అధిపతుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం చెబుతున్నా. మీ వద్ద చెప్పడానికి విలువైన విషయాలేవీ లేకపోతే దయచేసి నోరు మూసుకుని ఉండండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

కూతురి ఎదుగుదలను ఇక ఎన్నటికీ చూడలేడు: ఫ్లాయిడ్‌ మాజీ భార్య


ఫ్లాయిడ్‌ మరణం తర్వాత ఆయన మాజీ భార్య రోక్సీ వాషింగ్టన్‌ తన ఆరేండ్ల కుమార్తె జియానాతో కలిసి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. ఫ్లాయిడ్‌ మంచి తండ్రి అని, పోలీసుల కర్కశత్వానికి అతడు బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారు ఇంటికివెళ్లి వారి కుటుంబంతో కలిసి ఉంటారు. కానీ, జియానాకు తండ్రి లేడు. జియానా ఎదుగుదలను, ఉన్నత విద్యను అతడు చూడలేడు’ అంటూ వాపోయారు. ‘ఆయనకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆయన చాలా మంచివారు’ అని పేర్కొన్నారు. ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన నలుగురు పోలీసులను శిక్షించాలని డిమాండ్‌చేశారు. 


logo