సోమవారం 13 జూలై 2020
International - Jun 03, 2020 , 01:34:21

అమెరికాలో మార్మోగుతున్న ‘ఐ కాంట్‌ బ్రీత్‌' నినాదం

అమెరికాలో మార్మోగుతున్న ‘ఐ కాంట్‌ బ్రీత్‌' నినాదం

  • ఉడుకుతున్న ఊపిరి
  • అమెరికాలో మార్మోగుతున్న ‘ఐ కాంట్‌ బ్రీత్‌' నినాదం
  • గతంలో హత్యకు గురైన వారి పేర్లే నినాదాలు
  • సైన్యాన్ని దించుతానని ట్రంప్‌ బెదిరింపులు
  • శాంతియుత నిరసనకు ఫ్లాయిడ్‌ సోదరుడి పిలుపు

ఒక రంగును మరో రంగు ద్వేషించే దుష్టరాజ్యంలో ఊపిరి ఉడికిపోతున్నది. సెగలు కక్కుతున్న ఉచ్ఛాస నిశ్వాసాలకు శ్వేతసౌధం పునాదులు కదులుతున్నాయి. ఫ్లాయిడ్‌ ఆఖరి ఆర్తనాదమే ఆందోళనకారుల గొంతుల్లో నినాదమై పిక్కటిల్లుతున్నది. ఫ్రెడ్జి గ్రే, బ్రెట్టీ జోన్స్‌ సహా అనేక మంది అమరత్వం కొత్త నినాదాలు అందిస్తున్నది. మాది ఆక్రోశం కాదు.. తరతరాలుగా మా జాతిని నీచంగా చూస్తున్న మీ అహంకారంపై మా ఆగ్రహం. ఓక్లహామా, బాల్టిమోర్‌.. నాటి సామూహిక హననాలు మొదలు నేటి అణచివేత వరకు జాతి వివక్ష నుంచి విముక్తి కోసం చేస్తున్న పోరాటమని నినదిస్తున్నారు. 

ఇదిగో.. ఇక్కడ స్వేచ్ఛకు ఊపిరి నిలిచిపోయింది. తల నుంచి మొండెం వేరైపోయిన ఈ స్వేచ్ఛా ప్రతిమ.. తనకు ఊపిరాడటంలేదని అరచి అరచి.. కండ్లలోంచి కన్నీళ్లు కార్చి కార్చి.. ఇంకిపోయి.. ప్రాణం ఆరిపోయినట్టుగా ఉన్నది. జాత్యహంకారపు అంధ విశ్వాసపుటెడారిగా మారిన అమెరికాలో.. ఆగిపోయిన జార్జి ఫ్లాయిడ్‌ ఊపిరికి ఇది అచ్చమైన ప్రతీక. 


షికాగో/వాషింగ్టన్‌, జూన్‌ 2: ‘ఐ కాంట్‌ బ్రీత్‌' (నాకు ఊపిరి ఆడడం లేదు) అన్న నినాదం అమెరికా వీధుల్లో మార్మోగుతున్నది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ తన చివరి క్షణాల్లో చేసిన ఈ ఆర్తనాదం.. జాతివివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తున్నది. ఫ్లాయిడ్‌ హత్యతో మొదలైన నిరసనోద్యమం.. క్రమంగా తీవ్రరూపం దాల్చుతున్నది. ఇది ఒక హత్యతో వచ్చిన ఆక్రోశం కాదని, తరతరాలుగా శ్వేతజాతీయులు చూపుతున్న వివక్షపై వెల్లువెత్తిన ఆగ్రహమని నిరసనకారులు చాటుతున్నారు. గతంలో పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్లజాతీయుల పేర్లను నినాదాలుగా మార్చుకుంటున్నారు. మేరీలాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ పట్టణంలో నిరసనకారులు ‘ఫ్రెడ్డీ గ్రే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయగా.. కాన్సస్‌ రాష్ట్రంలోని టొపెకా, కాన్సస్‌ వంటి నగరాల్లో టీ-షర్టులపై డొమినిక్‌ వైట్‌ పేరును ముద్రించుకున్నారు. 

ఓక్లహామాలో శతాబ్దం కిందట వందల మంది నల్లజాతీయులను సామూహికంగా హత్యచేసిన ప్రాంతంలో సోమవారం వందల మంది గుమిగూడి ‘టెరెన్స్‌ క్రచర్‌' పేరును స్మరించారు. ‘వివిధ జాతుల ప్రజలు ఫ్లాయిడ్‌ ఘటనతో ఆత్మావలోకనం చేసుకుంటున్నారు. గతంలో పోలీసుల చేతిలో హత్యకు గురైనవారిని తలుచుకొంటున్నారు. బాధితులందరికీ న్యాయం జరుగాలనే డిమాండ్‌ పెరిగింది’ అని షికాగోకు చెందిన మంత్రి మార్షల్‌ హ్యాచ్‌ పేర్కొన్నారు. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొని ‘బ్రెట్టీ జోన్స్‌' అంటూ నినాదాలు చేశారు. బ్రెట్టీజోన్స్‌ 2015లో పొరుగింటివారితో గొడవపడుతుండగా పోలీసులు అమానుషంగా కాల్చి చంపారు. 

67000 మంది నేషనల్‌గార్డ్స్‌ మోహరింపు..

నిరసనల నేపథ్యంలో 150కిపైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆరు రాష్ర్టాలు, 13 ప్రధాన నగరాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా 67 వేల మంది నేషనల్‌ గార్డ్‌లను మోహరించారు. ఇప్పటివరకు 4000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా, సోమవారం రాత్రి బఫెలోలో నిరసనల సందర్భంగా ఒక వాహనం పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. డ్రైవర్‌ను, అందులోని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

శాంతియుతంగా పోరాడుదాం

మినియాపొలిస్‌: ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాలని ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీచేయగా, మరోవైపు జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోదరుడు టెరెన్స్‌ ఫ్లాయిడ్‌ శాంతి సందేశం వినిపించారు. హింసాత్మక నిరసనలు ఆపాలని, శాంతియుతంగా పోరాడం సాగించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తిచేశారు. పోలీసులు చేతిలో తన సోదరుడు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించారు. మోకాలిపై కూర్చొని ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమయ్యారు. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. హింసాత్మక చర్యలను ఆపాలని, తన సోదరుడిని అవి వెనక్కి తీసుకురాలేవని పేర్కొన్నారు.  

ఫ్లాయిడ్‌ది హత్యే.. పోస్ట్‌మార్టం నివేదిక

ఫ్లాయిడ్‌ది హత్యేనని సోమవారం విడుదలైన పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. మెడను తొక్కిపెట్టడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. అతడికి ఇతర హృదయ సంబంధిత రోగాలు కూడా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 

ఇండియన్‌ అమెరికన్‌ సీఈవోల సంఘీభావం

వాషింగ్టన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సహా పలువురు ఇండియన్‌ అమెరికన్‌ సీఈవోలు ఆఫ్రికన్‌ అమెరికన్లకు తమ సంఘీభావం ప్రకటించారు. ‘మన సమాజంలో ద్వేషం, జాతివివక్షకు చోటులేదు. నల్లజాతి, ఆఫ్రికన్‌ అమెరికన్‌ వర్గ ప్రజలకు నా మద్దతు తెలుపుతున్నా. మా కంపెనీ, కమ్యూనిటీల్లోనూ ఇందుకు కట్టుబడి ఉన్నాం’ అని సత్యనాదెళ్ల పేర్కొన్నారు. జాతి సమానత్వానికి గూగుల్‌ మద్దతు తెలుపుతున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇదివరకే పేర్కొన్నారు. మరోవైపు, పెప్సికో సీఈవో ఇంద్రానూయీ స్పందిస్తూ.. ‘ఫ్లాయిడ్‌ విషాద మృతిపై గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా లక్షల మంది నిరసనల ద్వారా తమ ఆవేదనను వినిపించారు. వారి బాధను, అందుకు కారణమైన జాతి వివక్షను గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. వారికి న్యాయం అందించడానికి తోడ్పడుతున్న సంస్థలకు అండగా నిలువాలి’ అని కోరారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌' (ఏఏపీఐ) విచారం వ్యక్తం చేసింది. జాతివివక్ష, మైనార్టీలపై హింసను ఖండించింది.


సైన్యాన్ని రంగంలోకి దించుతా: ట్రంప్‌

హింసాత్మక ఘటనలను ‘అణచివేయకపోతే’ మిలిటరీని రంగంలోకి దించుతానని ఆయా రాష్ర్టాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. సోమవారం వైట్‌ హౌజ్‌లోని రోజ్‌గార్డెన్‌లో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవడంలో పలు రాష్ర్టాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ‘గత కొద్ది రోజులుగా దేశంలో అరాచకవాదులు, దోపిడీదారులు, హింసాత్మక మూకలు, నేరస్థులు, అంటిఫా, ఇతరులు రాజ్యమేలుతున్నారు. ఇవి శాంతియుత నిరసనలు కావు. ఉగ్రవాద చర్యలు. ఫ్లాయిడ్‌ దారుణ హత్య అమెరికన్లందరినీ కలిచివేసింది. జార్జ్‌, అతడి కుటుంబానికి తప్పక న్యాయం చేస్తాం.’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

నిరసనకారులు దేశ రాజధానిలోని లింకన్‌ స్మారకం, రెండో ప్రపంచ యుద్ధ స్మారకాన్ని ధ్వంసం చేశారని, చారిత్రక చర్చికి నిప్పుపెట్టారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేవారికి తన మద్దతు ఉంటుందని పేర్కొంటూ పరిస్థితులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండగా, శ్వేతసౌధం సమీపంలోని పార్కులో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. అనంతరం ట్రంప్‌ ఆ పార్క్‌ గుండా వెళ్లి ధ్వంసమైన చర్చి ముందు ఫొటో దిగారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి.  


logo