శనివారం 23 జనవరి 2021
International - Jan 02, 2021 , 15:24:39

మనకు ఆనందం.. వాటికి ప్రాణసంకటం

మనకు ఆనందం.. వాటికి ప్రాణసంకటం

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఇది ఏటా జరిగే తంతే. ప్రభుత్వాలే న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించేందుకు ముందుకు రావడంతో.. పెద్ద ఎత్తున టపాసులు కాల్చడం ఆనవాయితీగా మారింది. రెండురోజుల క్రితం జరిగిన న్యూ ఇయర్‌ సంబురాలు మనకు ఆనందం కలిగిస్తుంటే.. పక్షులకు మాత్రం ఇబ్బందికరంగా తయారైంది. ఇటరీ రాజధాని రోమ్‌లో నిర్వహించిన కొత్త సంవత్సరం సంబురాలు వేలాది పక్షుల ప్రాణాలు తీశాయి.

నూతన సంవత్సర పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తెల్లారి చూసే సరికి వందలాది పక్షులు చనిపోయి పడి ఉన్నాయి. రోమ్ ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వీధుల్లో డజన్ల కొద్దీ పక్షులు చనిపోయి ఉన్నది చూడొచ్చు. పక్షుల మరణాలకు స్పష్టమైన కారణాలేవీ లేనప్పటికీ.. జంతు హక్కుల సంఘాలు మాత్రం ఈ ఘటనను "ఊచకోత" అని పేర్కొంటున్నాయి. పక్షులు గూడు కోసం ఉపయోగించే చెట్ల ఆకులపై టపాసుల ప్రభావం చూపి వాటి మరణానికి కారణమైందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ (ఓఐపీఏ) ప్రతినిధి లోరెడానా డిగ్లియో విచారం వ్యక్తం చేశారు. ఒకేసారి పెద్ద ఎత్తున టపాసులు కాల్పడం వల్ల పక్షులు భయపడిపోయి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, కిటికీలకు లేదా విద్యుత్‌ లైన్లకు కొట్టుకుని చచ్చిపోయి ఉండొచ్చని ఆయన చెప్పారు.

బాణసంచా ప్రదర్శన ప్రతి సంవత్సరం జంతువులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నది. వ్యక్తిగత బాణసంచా కాల్చడాన్ని రోమ్ నగరం నిషేధించినప్పటికీ, పక్షుల మరణాలు అసాధారణ సంఖ్యలో జరుగడం విశేషం. జంతువులకు ముప్పున్నందున ఓఐపీఏ ఇటాలియన్ శాఖ వ్యక్తిగత ఉపయోగం కోసం బాణసంచా కాల్చడాన్ని, అమ్మకాలను నిషేధించాలని పిలుపునిచ్చింది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo