మంగళవారం 19 జనవరి 2021
International - Jan 08, 2021 , 07:27:31

అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకొంటారంటే..

అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకొంటారంటే..

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓటమిని ఒప్పుకోనని ట్రంప్‌ పదేపదే చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిబంధనలను అమలు చేసిందని, ఇది చెల్లదంటూ కోర్టుకెక్కారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపలేదని కోర్టులు ఆయన మద్దతుదారులు వేసిన పిటిషన్లను కొట్టివేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలు ఎందుకు వివాదాస్పదం అవుతాయి.. అధ్యక్షుడిని ఎలా ఎన్నుకొంటారో.. చూద్దాం.. 

ప్రైమరీస్‌

అమెరికాలో 50 రాష్ర్టాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు ఉంటారు. కొన్ని రాష్ర్టాల్లో పార్టీకి ఓ బృందం నాయకత్వం వహిస్తుంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనుకొనే వ్యక్తి పార్టీ నుంచి ఇతరుల మద్దతు కూడగట్టుకోవాలి. 

నేషనల్‌ కన్వెన్షన్‌

రాష్ర్టాలవారీగా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక..  రెండు పార్టీలు వేర్వేరుగా తమ జాతీయ స్థాయి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇందుకోసం అభ్యర్థులు పార్టీలో అంతర్గతంగా ఇతర అభ్యర్థుల మద్దతు కోరతారు. లేదా పోటీ పడతారు. అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన వ్యక్తి ఉపాధ్యక్ష పదవి కోసం అభ్యర్థిని ఎంపిక చేసుకొంటారు. 

సాధారణ ఎన్నికలు

రాజకీయ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక అమెరికాలో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఓటర్లు నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఓటేయరు. వారి తరఫున 50 రాష్ర్టాల్లో 538 అభ్యర్థులు బరిలో ఉంటారు. వీరిని ఎలక్టోరల్‌ ఓట్లు అంటారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు (270 అంతకంటే ఎక్కువ) వస్తే ఆ పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. 

పాపులర్‌ ఓటు.. గెలుపు ధ్రువీకరణ

అమెరికాలో పాపులర్‌ ఓటు విధానం వల్ల ఫలితాల్లో గందరగోళం ఉంటుంది. ఒక రాష్ట్రంలో 50 ఎలక్టోరల్‌ ఓట్లు ఉంటే ఒక అభ్యర్థికి 26 మరొకరికి 24 ఓట్లు వచ్చినా.. 26 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకొన్న అభ్యర్థి ఖాతాలోకే అన్ని ఓట్లు వెళ్తాయి. అంతే కాకుండా ఓట్ల లెక్కింపు నిబంధనలను కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీ ప్రాతినిధ్యం ఉన్న రాష్ర్టాల్లో ఆ పార్టీకి అనుకూలంగా, డెమోక్రటిక్‌ పార్టీ ప్రాతినిధ్యం ఉన్న రాష్ర్టాల్లో ఆ పార్టీకి అనుకూలంగా నిబంధనలను రూపొందించుకొనే వీలుంది. ఆయా నిబంధనల ప్రకారమే రాష్ర్టాల్లోని ఎన్నికల అధికారులు అభ్యర్థుల గెలుపును ధ్రువీకరిస్తారు. చివరిగా కాంగ్రెస్‌( ప్రతినిధుల సభ, సెనేట్‌) సమావేశమై రాష్ర్టాలవారీగా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను ధ్రువీకరిస్తుంది.