శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 13, 2021 , 15:48:53

కొత్త హెచ్‌1-బీ వీసా రూల్స్ ఏంటి? ఇండియ‌న్స్‌కు ఎలా న‌ష్టం?

కొత్త హెచ్‌1-బీ వీసా రూల్స్ ఏంటి? ఇండియ‌న్స్‌కు ఎలా న‌ష్టం?

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పోతూ పోతూ మ‌రోసారి ఇండియ‌న్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్య ట్రంప్ ప్ర‌భుత్వం హెచ్‌1-బీ వీసాల విష‌యంలో తీసుకొచ్చిన మార్పులు భార‌తీయ విద్యార్థులు, కంపెనీల‌కు న‌ష్టం చేకూర్చ‌నున్నాయి. హెచ్‌1-బీ వీసాలు, గ్రీన్‌కార్డుల‌తో ప‌నిచేసే వాళ్ల‌కు ఇవ్వాల్సిన కనీస జీతాల‌ను భారీగా పెంచుతూ ట్రంప్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ స‌వ‌రించిన నిబంధ‌న‌ల‌ను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ (డీఓఎల్‌) ప్ర‌క‌టించింది. ఇది అతి త‌క్కువ జీతాల‌కు ప‌నిచేసే విదేశీ వ‌ర్క‌ర్ల నుంచి అమెరిక‌న్ వ‌ర్క‌ర్ల‌ను ర‌క్షించే ఉద్దేశంతో చేసిన ప‌ని. ఇప్పుడీ కొత్త రూల్స్ ఈ హెచ్‌1-బీ వీసాల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన ఇండియ‌న్స్‌పై తీవ్ర ప్ర‌భావం చూపనున్నాయి. 

కొత్త వేత‌న నిబంధ‌నలు ఏంటి?

ఇక్క‌డ వేత‌నం అంటే హెచ్‌1-బీ వీసా కింద వ‌చ్చిన ఉద్యోగికి స‌ద‌రు సంస్థ చెల్లించే మొత్తం. ఇది ఆ రంగంలో ప్ర‌స్తుతం ఉన్న వేత‌న స్థాయికి స‌మానంగా లేక ఎక్కువ‌గా ఉండాలి. అలాంటి వేత‌నం ఇచ్చే కంపెనీల ద‌ర‌ఖాస్తులకే వీసాల జారీ ప్ర‌క్రియ‌లో ప్రాధాన్యం ఇస్తారు. దీని కోసం యూఎస్ లేబ‌ర్ డిపార్ట్‌మెంట్ ఆక్యుపేష‌న‌ల్ ఎంప్లాయ్‌మెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్‌) డేటాను ప‌ర‌గ‌ణ‌లోకి తీసుకుంటుంది. వివిధ రంగాలు, అందులోని వివిధ హోదాల వారికి చెల్లిస్తున్న స‌గ‌టు వేత‌నం ఆధారంగా ఈ హెచ్‌1-బీ వీసాదారుల క‌నీస వేతనాన్ని లెక్కిస్తారు. కొత్త నిబంధ‌న ప్ర‌కారం.. హెచ్‌1-బీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి జాబ్ టైప్, లొకేష‌న్ ప్ర‌కారం అక్క‌డ‌ ప్ర‌స్తుతం ఉన్న వేత‌నంలో క‌నీసం 35 శాతం ఇవ్వాలి. గ‌తంలో ఇది కేవ‌లం 17 శాతంగా ఉండేది. ఇందులోనూ అనుభ‌వాన్ని బ‌ట్టి ఎంట్రీ లెవ‌ల్ నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ లెవల్ వ‌ర‌కు నాలుగు స్థాయిల‌లో ఉంటాయి. అత్య‌ధిక వేతన స్థాయిలో ఉన్న వారు క‌చ్చితంగా 90 శాతం వేత‌నం అందుకోవాలి. 

ఇండియ‌న్ స్టూడెంట్స్‌, కంపెనీలపై ప్ర‌భావం ఎంత‌?

ఈ కొత్త నిబంధ‌న‌లు భార‌తీయ విద్యార్థుల‌పై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపున్నాయి. ఫ్రెష్‌గా గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వాళ్లు లేదా రెండేళ్ల వ‌ర‌కూ అనుభ‌వం ఉన్న వాళ్ల‌కు ఈ కొత్త రూల్స్ వ‌ల్ల న‌ష్టం క‌ల‌గ‌నుంది. ప్ర‌స్తుతం ఇలాంటి ఇండియ‌న్ స్టూడెంట్స్ అమెరికాలో 2 ల‌క్షల వ‌ర‌కూ ఉన్నారు. కొత్త వేత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎక్కువ జీతాలు ఉన్న సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్స్‌కు సునాయాసంగా ఉద్యోగాలు దొర‌క‌నుండ‌గా.. విద్యార్థుల‌కు ఎంట్రీ లెవ‌ల్లో అయినా ఆ స్థాయి జీతాలు కంపెనీలు ఇవ్వ‌లేవు. దీంతో విద్యార్థుల‌కు ఈ రూల్స్‌తో న‌ష్ట‌మే. దీనివ‌ల్ల త‌మ అమెరికా చ‌దువుల‌కు క్రేజ్ త‌గ్గే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని యూనివ‌ర్సిటీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. 

అటు కంపెనీలు కూడా ఇక నుంచీ హెచ్‌1-బీ వ‌ర్క‌ర్ల‌కు ఎక్కువ జీతాలు ఇవ్వాలి. హెచ్‌సీఎల్ అమెరికాలాంటి స్టాఫింగ్, అవుట్‌సోర్సింగ్ కంపెనీల‌పై ఇది తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ హెచ్‌సీఎల్ అమెరికా.. త‌మ వ‌ర్క‌ర్ల‌లో 29 శాతం మందికి మాత్ర‌మే ఇప్పుడు జీతాల్లో 20 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తోంది. ఈ కొత్త రూల్స్ ప్ర‌కారం ఇప్పుడది క‌నీసం 35 శాతం కంటే ఎక్కువే ఉండాలి. 

ఎప్పుడు అమ‌ల్లోకి వ‌స్తాయి?

ఈ కొత్త నిబంధ‌న‌లు మార్చి 9, 2021 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. అయితే అంత‌లోపే అంటే మార్చి 1న హెచ్‌1-బీ వీసాల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అదే జ‌రిగితే ఈ కొత్త నిబంధ‌న‌లు వారికి వ‌ర్తించ‌వు. అయితే కొత్త నిబంధ‌న‌లు అమల్లోకి వ‌చ్చే వ‌ర‌కూ ఈ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆల‌స్యం చేసే అవ‌కాశం కూడా ఉంది. 

బైడెన్ ప్ర‌భుత్వం దీనిని ర‌ద్దు చేస్తుందా?

ఇప్పుడు ఇండియ‌న్స్‌కు ఉన్న ఏకైక ఆశ కొత్త అధ్య‌క్షుడు బైడెనే. ఈ కొత్త రూల్స్‌ను బైడెన్ ప్ర‌భుత్వం వెంట‌నే అమ‌లు చేయ‌క‌పోవ‌చ్చ‌ని ఇమ్మిగ్రేష‌న్ నిపుణులు అంచనా వేస్తున్నారు. త‌న ప్ర‌భుత్వంలో ఇమ్మిగ్రేష‌న్ సంస్క‌ర‌ణ‌లపైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తాన‌ని ఇప్ప‌టికే బైడెన్ స్ప‌ష్టం చేశారు. తాను అధికారంలోకి రాగే ఇమ్మిగ్రేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తాన‌ని చెప్పారు. ఇందులో చాలా వ‌ర‌కూ ట్రంప్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు, విధానాల‌ను రివ‌ర్స్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. పైగా కొత్త నిబంధ‌న‌లు కోర్టుల్లోనూ నిల‌వ‌డం క‌ష్ట‌మే. గ‌తంలో రెండుసార్లు హెచ్‌1-బీ వీసా నిబంధ‌న‌ల్లో తీసుకొచ్చిన మార్పులను కోర్టులు కొట్టేశాయి. 


ఇవి కూడా చ‌ద‌వండి

అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ ధ‌ర ఎంతో తెలుసా?

ప్లీజ్‌.. మా పాప ఫొటోలు తీయొద్దు!

ఇండియాకు టెస్లా.. కారు ధ‌ర ఎంతో తెలుసా?

డేంజ‌ర్‌లో టీమిండియా.. హోట‌ల్ ప‌క్క‌నే కొత్త క‌రోనా కేసులు!

బ్రిస్బేన్‌లో తిరుగులేని ఆస్ట్రేలియా.. గ‌బ్బా కోట బ‌ద్ధ‌ల‌య్యేనా?


logo