శనివారం 06 జూన్ 2020
International - Apr 11, 2020 , 10:47:17

క‌రోనాపై వియ‌త్నాం ఎలా గెలిచింది?

క‌రోనాపై వియ‌త్నాం ఎలా గెలిచింది?

న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మ‌హ‌మ్మారి ఎక్కడో వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఐరోపా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది. అంత‌కంటే దూరంగా ఉన్న‌ అగ్ర‌రాజ్యం అమెరికాను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. మొత్తంగా ప్ర‌పంచ దేశాల‌కు పాకిన ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ల‌క్ష మందిని పొట్ట‌న‌పెట్టుకున్న‌ది. ఇంత జ‌రుగుతున్నా చైనాకు స‌మీపంలోనే ఉన్న‌ ఒక దేశం మాత్రం క‌రోనా కోరలకు చిక్కలేదు. 

ఇంత‌కూ అది ఏ దేశం అనుకుంటున్నారా? అదే వియ‌త్నాం! చైనాకు ద‌గ్గ‌ర‌గా ఉన్నా ఆ దేశంలో క‌రోనా ప్ర‌బ‌ల లేదు. వియ‌త్నాం పాల‌కులు ముందు జాగ్ర‌త్త‌గా చేప‌ట్టిన చ‌ర్య‌లే ఆ దేశాన్ని క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడాయి. ఈ విజయంలో చిత్రకారుల పాత్ర కూడా ఉంది. లె డక్‌ హిప్‌ అనే ఆర్టిస్టు.. ఒక వ్య‌క్తి క‌రోనాకు వ్య‌తిరేకంగా ఆరోగ్య‌ కార్యకర్తతో చేయి కలిపి నినదిస్తున్న చిత్రాన్ని గీశారు. ఈ బొమ్మ‌తో వేసిన పోస్ట‌ర్లు సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. 

అలాగే పామ్ త్రంగ్ హా అనే మ‌రో కళ‌కారుడు.. క‌రోనా ప‌రీక్ష‌ల్లోనిమ‌గ్న‌మైన సిబ్బంది వెనుక పిడికిలితో ఉన్న చిత్రాన్ని రూపొదించాడు. ఈ చిత్రం కూడా జ‌నాన్ని ఆక‌ట్టుకుంది. చైనాలో క‌రోనా ప్ర‌బ‌లిన విష‌యం తెలిసిన వెంట‌నే వియ‌త్నాం ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసింది. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంలో స‌ఫ‌ల‌మైంది.  

అదేవిధంగా ప్రభుత్వ పిలుపు మేరకు అందరూ మాస్క్‌లు ధరించాలన్న పోస్టర్లు కూడా ఊరూ వాడా వైరల్ అయ్యాయి. ఇక‌, చైనా నుంచి వచ్చే విమానాలను వియ‌త్నాం ప్ర‌భుత్వం నిషేధించింది. దేశంలోకి వైర‌స్ ప్ర‌వేశించ‌క ముందే పాఠ‌శాల‌లు మూసేయించింది. ఆ వెంట‌నే లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారికి క‌ఠిన‌ శిక్షలు అమలు చేసింది. మాస్క్‌లు ధరించకుండా తిరిగితే జరిమానాలు వేసింది. మాట‌విన‌ని వారిని జైళ్ల‌కు పంపింది. 

ఇలా, అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతూనే దాదాపు 88 వేల మంది అనుమానితుల‌కు క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు చేయించింది. వారిలో 255 మందికి కరోనా ఉన్న‌ట్లు తేల్చింది. వారిలోనూ ఇప్ప‌టికే 128 మంది కోలుకున్నారు. మిగ‌తావారు కూడా కోలుకుంటున్నారు. ఒక్క‌రు కూడా మ‌ర‌ణించ‌లేదు. ఈ విధంగా చ‌కాచ‌కా చ‌ర్య‌లు తీసుకోబ‌ట్టే వియ‌త్నాం క‌రోనా ర‌క్క‌సికి చిక్క‌కుండా బ‌య‌ట‌ప‌డింది. 


logo