బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 18:58:43

అబ్బాయితో మాట్లాడినందుకు ఇద్దరు అమ్మాయిల హత్య...

అబ్బాయితో మాట్లాడినందుకు ఇద్దరు అమ్మాయిల హత్య...

పాకిస్తాన్‌లో చాలా ప్రాంతాలు ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇంకా పూర్తిగా దేశ ప్రభుత్వ ఆధీనంలోకి రానట్టే ఉంటాయి. అరాచక వ్యవస్థ ఆ ప్రాంతాల్లో నడుస్తూ ఉంటుంది. ఈ మద్యనే పాకిస్తాన్‌లో ఇద్దరు అమ్మాయిల పరువు హత్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్‌లో మహిళలకు ఉన్న హక్కులను ఈ ఉదంతం మరోసారి బయటపెట్టింది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలను హత్య చేసారు. అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16, 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను వారి బంధువు చంపాడు. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో పురుషులతో స్త్రీలు కలవడం నిషేధించారు అక్కడి పెద్దలు. ఖైబర్‌-పఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌ జిల్లాలోని షామ్‌ ప్లెయిన్‌ గారియోమ్‌ గ్రామంలో మే 14 న ఈ హత్యలు జరిగాయని ఓ అధికారి తెలిపారు.

హత్యలకు కారణం 52 సెకన్ల వీడియోలో ఒక యువకుడు ముగ్గురు బాలికలతో మాట్లాడుతున్నట్లు కనపడగా, ఆ వీడియోలోని ఇద్దరు బాలికలు చంపబడ్డారని, మూడవ అమ్మాయి ఆచూకీ తెలియదని అక్కడ అధికారులు తెలిపారు. మూడవ అమ్మాయి బతికే ఉందని చెప్పినప్పటికీ, ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసు అధికారి తెలిపారు. అయితే ఆ వీడియోలో ఉన్న యువకునికి కూడా ప్రాణ హాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో అంతగా పోలీసుల ప్రాభల్యం లేకపోవడం వల్ల గ్రామాల్లో పెద్దలు చెప్పిందే చట్టంగా నడుస్తుంది. దీంతో ఇటువంటి ఘటనలు ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి.


logo