శుక్రవారం 10 జూలై 2020
International - May 24, 2020 , 17:12:47

అట్టుడికిన హాంగ్‌ కాంగ్‌

అట్టుడికిన హాంగ్‌ కాంగ్‌

హాంగ్‌ కాంగ్‌లో గత కొన్నిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించిన ఆందోళనలు మళ్లీ తారాస్థాయికి చేరుకొన్నాయి. ఆదివారం నాడు వేల సంఖ్యలో ఆందోళనాకారులు రోడ్లపైకి రావడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు, వాటర్‌ క్యానన్లను ప్రయోగించాల్సి వచ్చింది. హాంగ్‌ కాంగ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చైనాకు నేరస్థుల అప్పగింత చట్టాన్ని రద్దు చేయాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రతిపాదిత చట్టాన్ని నిరసిస్తూ హాంగ్‌ కాంగ్‌లోని కాజ్‌వే బే జిల్లాలో నిరసనకారులు నల్లటి దుస్తులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. నీలి జెండాలను చూపిస్తూ పోలీసులు వెళ్లిపోవాలని  కోరినప్పటికీ ఆందోళనాకారులు పెడచెవిన పెట్టడంతో.. భాష్పవాయువు ప్రయోగించి అనంతరం వాటర్‌ క్యానన్లతో వారిని తొలగించే పనిని చేపట్టారు. ఈ సందర్భంగా 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

ప్రతిపాదిక చట్టం పట్ల హాంగ్‌ కాంగ్‌  అంతటా  తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు గత శుక్రవారం చైనా జాతీయ అసెంబ్లీలో సమర్పించారు. ఈ నెల 28 న జరుగనున్న సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు  తెలుస్తున్నది. ఈ చట్టం అమలులోకి వస్తే నిందితులను విచారించేందుకు ఎలాంటి కోర్టు అనుమతి లేకుండా చైనాకు తీసుకెళ్లొచ్చు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని చైనా కమ్యూనిస్ట్‌ నేతలు తమను ఇష్టానుసారంగా తరలించి చిత్రహింసలు పెడుతారని హాంగ్‌ కాంగ్‌ వాసులు భయపడుతున్నారు. 

హాంగ్‌ కాంగ్‌లో ఒక దేశం- రెండు వ్యవస్థల విధానం అమలవుతున్నది. 1997 లో కుదిరిన ఒప్పందం  ప్రకారం 50 ఏండ్లపాటు హాంగ్‌ కాంగ్‌పై చైనాదే పెత్తనం ఉంటుంది. అంటే 2047 దాకా ఇదే  పరిస్థితి కొనసాగుతుంది. ఈలోగా హాంగ్‌ కాంగ్‌ను తన  ఆధీనంలోకి తెచ్చుకొని తమ ముద్ర వేయాలని చైనా తహతహలాడుతుండటం.. ఈ నేపథ్యంలో నేరస్థుల అప్పగింత చట్టం తీసుకురావడం వివాదాస్పదమైంది.


logo