సోమవారం 06 జూలై 2020
International - Jun 17, 2020 , 19:02:04

హొండూరన్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

హొండూరన్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

తెగుసిగల్ప: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా  హొండూరన్‌  దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఓర్లాండ్‌ తెలిపారు. ప్రస్తుతం  చికిత్స తీసుకుంటున్నానని, సహాయ సిబ్బంది సాయంతో వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా పనిచేస్తానని చెప్పారు. హెర్నాండెజ్ భార్యతో పాటు అతని ఇద్దరు సహాయకులకు కూడా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. వారందరికీ వైద్యులు చికిత్స చేస్తున్నారు.

'ఒక దేశాధ్యక్షుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.  కొద్దిరోజుల నుంచి ఆరోగ్యపరంగా  అసౌకర్యంగా అనిపించడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా నేను కోవిడ్‌-19 బారిన పడ్డానని నిర్ధారణ అయిందని' హెర్నాండెజ్‌ టీవీ ప్రసంగంలో తెలిపారు.

విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, నా సహాయకుల ద్వారా పనిచేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు జువాన్‌ చెప్పారు. హొండూరన్‌లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య  9,656కు చేరగా.. 330 మంది కరోనా వల్ల చనిపోయారు.  


logo