మంగళవారం 26 మే 2020
International - Apr 09, 2020 , 10:19:37

క‌రోనాతో హాలీవుడ్ న‌టుడు గార్ఫీల్డ్‌ మృతి

క‌రోనాతో హాలీవుడ్ న‌టుడు గార్ఫీల్డ్‌ మృతి

లాస్‌ ఏంజిల్స్‌: మాయ‌దారి కరోనా మహమ్మారి బారిన‌ప‌డి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. హాలీవుడ్‌ నటుడు అలెన్ గార్ఫీల్డ్‌ (80) కరోనా చికిత్స పొందుతూ మంగళవారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఆయన సహచర నటి   రోనీ బ్లాక్లే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఒక‌ పోస్ట్‌ పెట్టారు. అలెన్ ఆత్మ‌కు శాంతి చేకూరాలని ఆమె పేర్కొన్నారు. నాష్‌విల్లె సినిమాలో త‌న‌కు భర్తగా నటించిన వ్యక్తి కరోనా వల్ల మ‌ర‌ణించాడ‌ని తెలిసి బాధ‌నిపించిందని, ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నానని రోని త‌న ఫేస్‌బుక్ పోస్టులో రాశారు. 

అలెన్.. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. విలన్‌ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్‌, విమ్‌ వెండర్స్‌ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు. 


logo