వాషింగ్టన్, జూన్ 30: కెనడా, అమెరికాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. కెనడాలో రికార్డు స్థాయిలో 49.5 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఎండల తీవ్రత, వడగాడ్పులతో గడిచిన నాలుగు రోజుల్లో ఆ దేశంలో 233 మంది చనిపోయారు. ఈ వారం అంతా ఎండలు ఇలాగే ఉంటాయని బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా తదితర ప్రాంతాల ప్రజలను కెనడా ప్రభుత్వం హెచ్చరించింది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఎండల తీవ్రతకు వాంకోవర్ సహా పలు ప్రాంతాల్లో బడులు, వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. మరోవైపు, వాయవ్య అమెరికాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఎండల తీవ్రతకు అమెరికాలోని పలు రాష్ర్టాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పర్యావరణ మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని నిపుణులు చెప్పారు.