ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 16:05:00

‘గుండె’ బరువెక్కించే చిత్రం.. ఫొటో వైరల్

‘గుండె’ బరువెక్కించే చిత్రం.. ఫొటో వైరల్

న్యూఢిల్లీ : ఇంట్లో  ఆర్థిక సమస్యలు తలెత్తకుండా  తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. కొందరు దేశాలు వదిలి వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుంటారు. ఈ క్రమంలో తమ కుటుంబంలోని చిన్న చిన్న సంతోషాలను కోల్పోతుంటారు. భార్యకు, పిల్లలకు దూరంగా ఉంటూ.. వారి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు చాలామంది విదేశాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇండియాకు వచ్చేందుకు విమానాలు లేవు. ఒకవేళ వచ్చినా ఎక్కడ కరోనా కాటేస్తుందోననే భయం. దీంతో  ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు.

దూరంగా ఉంటూ భారంగా కాలాన్ని గడుపుతున్నారు. అయితే దుబాయ్‌లో ఎమ్రిల్ సంస్థలోని ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్‌లో హౌస్ కీపింగ్‌ పని చేస్తున్న ఓ వ్యక్తి తన భార్యను తలుచుకుంటూ రోడ్డుపై రాలిన ఆకులను ‘హార్ట్’ రూపంలో మలచిన ఫొటో సోషల్ మీడియాలో తెగవైరల్‌ అవుతుంది. ఆ వ్యక్తి పేరు రమేష్ గంగరాజం గాంధీ. అతను తెలంగాణకు చెందిన వాడు. గతేడాది సెప్టెంబ‌ర్‌లో లత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నెల రోజుల్లోనే ఉద్యోగం కోసం దుబాయ్‌కు వచ్చాడు. మధ్యలో ఇంటికి రావాలని ఉన్నా.. లాక్‌డౌన్ వల్ల కుదరలేదు. దీంతో అప్పటి నుంచి దుబాయ్‌లోనే ఉండిపోయిన రమేష్ అతని భార్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ఓ రోజు రోడ్డు ఊడ్చుతూ.. ఓ చెట్టు కింద రాలిన ఆకులను ‘హార్ట్‌’ ఆకారంలో మలిచాడు. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా గాంధీ ‘గల్ఫ్ న్యూస్‌’తో మాట్లాడుతూ.. ‘నేను నా భార్య గురించి ఆలోచిస్తూ.. లవ్ సింబల్‌ వేశాను. ఆమెను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. నేను ఎంతగా ప్రేమిస్తున్నాననేది ఆమెకు కూడా బాగా తెలుసు’ అని చెప్పాడు.ఆ ఫొటో చూసిన చాలామంది అతడు బాధలో ఉన్నాడని కామెంట్లు చేశారు. దీనిపై గాంధీ స్పందిస్తూ.. ‘ఆ ఫొటో చూసి చాలామంది నేను బాధలో ఉన్నానని అనుకున్నారు. అందులో నిజం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా లక్కీ. నాకు మంచి ఉద్యోగం ఉంది. రోజూ నా పనిని ఎంతో ఎంజాయ్ చేస్తాను. నా ఆరోగ్యం కూడా బాగుంది’’ అని తెలిపాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo