మంగళవారం 07 జూలై 2020
International - Jun 04, 2020 , 12:50:58

రెండు నెలల తర్వాత తల్లిని చూసి బోరున ఏడ్చిన పిల్లలు

రెండు నెలల తర్వాత తల్లిని చూసి బోరున ఏడ్చిన పిల్లలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో వైద్యవృత్తి చేపట్టిన డాక్టర్లంతా కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో ఉన్నారని తెలిసినా ధైర్యంగా రోగులకు చికిత్స చేస్తున్నారు. పసిపిల్లలు ఉన్న తల్లులు కూడా తమ బిడ్డలను వదిలి హాస్పిటల్‌కే పరిమితమయ్యారు. రెండు నెలల తర్వాత తిరిగి వచ్చిన ఓ తల్లిని చూసి ఇద్దరు పిల్లలు గట్టిగా హత్తుకొని ఏడ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంగ్లాండ్‌కు చెందిన సూసీకి ఇద్దరు ఆడపిల్లలున్నారు. 7 ఏండ్ల వయసున్న చిన్నమ్మాయి పేరు హెట్టి. 9 ఏండ్ల వయసున్న పెద్దమ్మాయి పేరు బెల్లా. సూసీ ఇంగ్లాండ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో ఓపీడీగా పనిచేస్తున్నది. కష్టకాలంలో వృత్తికి దూరంగా ఉండలేకపోయింది. అలాగని కన్నబిడ్డలను ఒంటరిగానూ వదలాలనుకోలేదు. తన ఇద్దరు పిల్లలను రిలేటివ్‌ ఇంట్లో ఉంచి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి హాస్పిటల్‌కు వెళ్లింది. 9 వారాలు అయినా ఇంకా ఇంటికి రాలేదు సూసీ. పిల్లలిద్దరూ అమ్మ ఎప్పుడు వస్తుందని తమ ఆంటీని అడుగుతుంటే ఆమెకు ఏం చెప్పాలో పాలుపోక ఏదో విధంగా బుజ్జగిస్తుండేది. ఆ రోజు రానే వచ్చింది. పిల్లలిద్దరూ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుండగా చప్పుడు లేకుండా తల్లి సూఫీ వెనుక నిల్చుని మాట్లాడుతుంది. అమ్మ స్వరాన్ని గుర్తుపట్టిన పెద్దమ్మాయి ‘మమ్మీ’ అని పెద్దగా అరుస్తూ గట్టిగా కౌగిలించుకున్నది. అమ్మను చూడగానే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. ఇన్నిరోజులూ మమ్మల్ని చూడాలని అనిపించలేదా అమ్మా.. అంటూ వెక్కివెక్కి ఏడ్వసాగారు. వీళ్లే కాదు వీడియో చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియోను యూజర్‌ చార్లొట్టే సేవేజ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.


logo