ఆదివారం 31 మే 2020
International - Apr 28, 2020 , 01:21:22

తలనొప్పి కూడా కరోనా లక్షణమే!

తలనొప్పి కూడా కరోనా లక్షణమే!

  • చలి, కండరాల నొప్పి, రుచి లేకపోవడం, వాసన పసిగట్ట లేకపోవడం, గొంతుమంట కూడా సంకేతాలే!
  • కరోనా రోగుల్లో బయటపడుతున్న కొత్త లక్షణాలు
  • అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా విశ్వమారిలో మరిన్ని కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు ఈ వైరస్‌ సోకిన రోగుల్లో కేవలం జ్వరం, దగ్గు, శ్వాస సమస్యతో కూడిన మూడు ప్రధాన లక్షణాలు మాత్రమే కనిపించేవి. అయితే, వైరస్‌కు సంబంధించి మరో ఆరు కొత్త లక్షణాలను గుర్తించినట్టు అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) తెలిపింది. చలి, వణుకుతో కూడిన చలి, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతులో మంట, రుచిని లేదా వాసనను గుర్తించలేకపోవడం వంటివి వైరస్‌కు సంకేతాలుగా భావించవచ్చని పేర్కొంది. వైరస్‌ సోకిన వారికి 2-14 రోజుల్లో తేలికపాటి లక్షణాల నుంచి తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయని తన వెబ్‌సైట్‌లో సీడీఎస్‌ పేర్కొంది. కొందరిలో రుచిని లేదా వాసనను గుర్తించలేకపోవడం, విరోచనాలు, చాలా మంది పిల్లలతోపాటు యువతలో పాదం, కాలి వేళ్లు రంగు మారడం (కొవిడ్‌ టోస్‌) వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. వైరస్‌ సోకిన 30-40 ఏండ్ల వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఆకస్మిక గుండెపోటు, ఇతర అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించినట్టు పేర్కొంది. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతరంగా ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, పెదవులు లేదా ముఖం నీలంగా మారటం వంటివి అత్యవసర హెచ్చరిక సంకేతాలుగా పరిగణించి వైద్యులను వెంటనే సంప్రదించాలని సీడీఎస్‌ సూచించింది. కాగా జ్వరం, పొడి దగ్గు, ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కరోనా ప్రాథమిక లక్షణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), సీడీసీ తొలుత ప్రకటించడం తెలిసిందే. 

ఎండలో ఉంటే వైరస్‌ రాదనుకోవద్దు!

కరోనా వైరస్‌ వ్యాప్తికి, ఉష్ణోగ్రతకు సంబంధమున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ‘వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్‌ సోకొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దేశాల్లో కూడా వైరస్‌ వ్యాపిస్తున్నది’ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సింగపూర్‌లో కూడా 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కేంద్ర నాడీ వ్యవస్థపైనా ప్రభావం.. 

కరోనా వైరస్‌ కేంద్ర నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నదని, అందుకే రోగులు వాసన, రుచిని చూసే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని జోధ్‌పూర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోగుల మెదడుకు తీసిన సీటీ, ఎమ్మారై స్కాన్లను పరిశీలించి ఈమేరకు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. ‘హ్యూమన్‌ యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌-2’ అనే గ్రాహకంతో ఈ వైరస్‌ అనుసంధానమవుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే వైరస్‌.. వాసనకు సంబంధించిన కణజాలాల్ని ఉపయోగించుకొని వాసన, రుచిని చూసే సామర్థ్యాలకు ప్రధానమైన మెదడులోని ‘ఆల్‌ఫ్యాక్టరీ బల్బు’ అనే నాడీ నిర్మాణంపై ప్రభావం చూపుతున్నదని, దీంతో రోగులు వాసన, రుచిని చూసే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని వివరించారు. 

‘ఈ మధ్యకాలంలో వైరస్‌ బాధితుల్లో మరిన్ని కొత్త లక్షణాలు బయట పడుతున్నట్టు అమెరికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రం-సీడీసీ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు మన దేశంలో అలాంటి లక్షణాలు కనిపించిన దాఖలాలు లేవు. భారతీయుల్లో వైరస్‌ తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు మనదగ్గర నమోదవుతున్న కేసులద్వారా తెలుస్తున్నది. దీనికి కారణాలేమిటనేది ప్రస్తుతానికి చెప్పలేనప్పటికీ, భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తున్నది’

- పరంజ్యోతి, పల్మానలజి విభాగాధిపతి, నిమ్స్‌ దవాఖాన


logo