e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 21, 2021
Advertisement
Home అంతర్జాతీయం అది బంగారు పంజరం

అది బంగారు పంజరం

  • రాజసౌధంలో ఎన్నో ఆంక్షలు ఉండేవి
  • నిందలు వేసి మానసికంగా ఎంతో హింసించారు
  • ఒకదశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
  • పుట్టబోయే బిడ్డ రంగు గురించి చర్చించేవాళ్లు 
  • సంచలన విషయాలు వెల్లడించిన హ్యారీ భార్య మేఘన్‌
  • బయటకొచ్చాక డబ్బులు రావడం ఆగిపోయాయి: హ్యారీ 

దేవదేవేరీలకు దక్కే అంతులేని వైభోగం-గౌరవ మర్యాదలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. అడుగులకు మడుగులొత్తుతూ ఎల్లవేళలా సపర్యలు చేసి పెట్టడానికి వందలమంది సిబ్బంది.. ఇటువంటి రాజభోగాలను స్వచ్ఛందంగా వదులుకున్న బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ దంపతులు తొలిసారిగా నోరువిప్పారు. బంగారు పంజరంలాంటి రాజసౌధంలో ఎదుర్కొన్న ఆంక్షలు, అపవాదుల చిట్టాను యావత్‌ ప్రపంచానికి తెలియజేశారు. 

లాస్‌ ఏంజెల్స్‌/లండన్‌, మార్చి 8: ప్రిన్స్‌ హ్యారీని పెండ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి కొత్త సభ్యురాలిగా అడుగుపెట్టాక తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మానసిక సంఘర్షణకు లోనయ్యానని మేఘన్‌ మార్కెల్‌ తెలిపారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా తనకు వచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబంలో వర్ణ వివక్ష పాతుకుపోయి ఉన్నదని ఆరోపించారు. రాజకుటుంబం నుంచి గతేడాది విడిపోయి అమెరికాలో సాధారణ జీవితం గడుపుతున్న ఈ దంపతులు తొలిసారిగా ఓ టీవీ షోలో మాట్లాడారు. అమెరికాలో పాపులర్‌ టీవీ యాంకర్‌ ఓప్రా విన్‌ఫ్రే ‘చాట్‌ షో’కు రెండు గంటపాటు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మార్కెల్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే..

అది బంగారు పంజరం

అమెరికా నటిగా జీవితాన్ని ఆరంభించిన నాకు రాచరికపు జీవితం గురించి ఎంత మాత్రం తెలీదు. మహారాణి ముందు ఎలా నడుచుకోవాలి? వంటివాటిపై అవగాహన లేదు. హ్యారీతో పెండ్లి అయిన తొలినాళ్లలో ఈ విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. కొత్త కోడలుగా వెళ్లిన నాపై ఆంక్షలు ఉండేవి. ఒక్కోసారిగా ఒంటరినయ్యా. మానసికంగా వేదనకు గురయ్యా. కొత్త వాతావరణానికి అలవాటుపడేందుకు నాకు కొంచం సమయం పడుతుందని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. నాపై నిందలు వేశారు.  వీటన్నింటినీ చూశాక ఆత్మహత్య చేసుకోవాలని కూడా బలంగా అనిపించేది.నేను గర్భిణీగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో ఒకటే చర్చ. నేను నల్లగా ఉన్నాను కాబట్టి, నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వాళ్లంతా ఆందోళన చెందారు. దీని గురించి హ్యారీతోనూ చర్చించారు. నల్ల రంగుతో పుడితే రాజ కుమారుడి హోదా నా బిడ్డకు రాదని నాముందే ఒకరు (మహారాణి ఎలిజబిత్‌ II, ఆమెభర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ కాదని ఓఫ్రా చెప్పారు)  మాట్లాడారు. రాజకుటుంబంలో మాకు రక్షణ ఉండదని ఆ క్షణమే నాకు అర్థమైంది.

నా వల్ల తోడికోడలు (హ్యారీ అన్నయ్య ప్రిన్స్‌ విలియమ్‌ భార్య) కేట్‌ (కేథరిన్‌) ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. నిజానికి ఏడ్చింది నేను. అయితే, ఆ తర్వాత ఆ సమస్య సద్దుమణిగింది. 

నాన్న నా ఫోన్‌ ఎత్తలేదు: హ్యారీ

రాచరిక విధులు, సంప్రదాయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన తర్వాత (2020 ప్రారంభం నుంచి) రాజకుటుంబం నుంచి తనకు డబ్బులు రావడం నిలిచిపోయాయని హ్యారీ తెలిపారు. ఆ సమయంలో తన తల్లి, దివంగత ప్రిన్సెస్‌ డయానా తన కోసం పక్కనబెట్టిన డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకున్నానని చెప్పారు. రాజకుటుంబం నుంచి విడిపోతున్నట్టు ప్రకటన చేసిన తర్వాత తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌ తనతో ఫోన్‌లో కూడా మాట్లాడటం మానేశారని పేర్కొన్నారు.

మా కలల రాణి వచ్చేస్తోంది..

హ్యారీ దంపతులు ఈ సందర్భంగా ఓ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తమకు ఆడబిడ్డ పుట్టబోతోందని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాను పాపకు జన్మనివ్వబోతున్నానని మేఘన్‌ చెప్పారు. బ్రిటన్‌ రాణి ఎలిజబిత్‌ II మనుమడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. మే 19, 2018లో అమెరికా నటి మేఘన్‌ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి.. మేఘన్‌ స్వస్థలం కాలిఫోర్నియాకు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు.

Advertisement
అది బంగారు పంజరం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement