సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 15:25:24

2004 లో పోయిన బ్యాగ్‌ దొరికింది..!

2004 లో పోయిన బ్యాగ్‌ దొరికింది..!

మోరీ: ఏదైనా చిన్న దొంగతనం కేసులుంటే ఓ రెండు లేదా మూడేళ్లలో మరిచిపోతుంటారు. కానీ ఆస్ట్రేలియా పోలీసులకు 16 ఏళ్ల క్రితం అంటే 2004లో దొంగిలించబడిన బ్యాగు ఇప్పుడు దొరికింది. అందులోని వస్తువుల ఆధారంగా దాన్ని వారు గుర్తుపట్టారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని మోరీ పోలీసులకు ఈ వారం ప్రారంభంలో కొందరు ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను అందజేశారు. గ్రామీణ న్యూ సౌత్ వేల్స్‌లోని పురాతన, అతిపెద్ద ఫ్యాషన్ షాపులలో ఒకటైన ఆసీఫ్స్‌ కారు పార్కింగ్‌ ప్రాంతంలో కొంతమంది నిర్మాణ కార్మికులకు దొరకగా, వారు తీసుకువచ్చి పోలీసులకు ఇచ్చారు. దాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. 

జూలై 2004 లో హెర్బర్, ఆబర్న్ స్ట్రీట్ కూడలి సమీపంలో ఆపి ఉంచిన యజమాని కారు వెనుక నుంచి హ్యాండ్‌బ్యాగ్ దొంగిలించబడింది. దోపిడీ జరిగిన కొన్ని రోజుల తరువాత, మోరీ రైల్వే స్టేషన్ సమీపంలో హ్యాండ్‌బ్యాగ్‌లోని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కానీ బ్యాగు దొరకలేదు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత బ్యాగుతోపాటు అందులోని మిగిలిన వస్తువులు కూడా దొరికాయి. అయితే, బ్యాగు పోగొట్టుకున్నవారు వస్తువుల గురించి క్లియర్‌గా చెప్పడం వల్లే తాము ఇలాంటి కేసులను గుర్తించుకోగలిగామని మోరీ పోలీస్‌ ఆఫీసర్‌ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్‌ మార్టిన్‌ బుర్కే పేర్కొన్నారు. త్వరలోనే యజమానికి బ్యాగును అందజేస్తామన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo