మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 03:12:06

వీసాలకు.. గడ్డుకాలమే!

వీసాలకు.. గడ్డుకాలమే!

  • హెచ్‌1బీ నిర్వచనంలో మార్పు.. హెచ్‌4 వీసాల రద్దు
  • స్టూడెంట్‌ వీసాలకు నిర్దిష్ట గడువు
  • ఓపీటీ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట
  • అమెరికా వీసా నిబంధనలు కఠినం

వాషింగ్టన్‌: అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నదంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌1బీ తదితర వీసాల జారీపై ఈ ఏడాది ఆఖరు వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం ఆ తరువాత కూడా కొనసాగడంతో పాటు వీసా నిబంధనలను మరింత కఠినం చేయనున్నట్టు తెలుస్తున్నది. అమెరికా ఇటీవల విడుదల చేసిన ‘2020 స్ప్రింగ్‌ ఎజెండా’లో వీసా నిబంధనలకు సంబంధించి మరిన్ని మార్పులకు ప్రతిపాదనలు చేశారు. దాని ప్రకారం ఇక నుంచి హెచ్‌1బీ వీసా నిర్వచనాన్ని మార్చనున్నారు. అత్యంత నైపుణ్యం ఉన్నవారికే ఈ వీసాను ఇవ్వనున్నారు. ఈ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి వీసాకు దరఖాస్తు చేసుకున్న సమయంలో అతను పనిచేస్తున్న కంపెనీ జీతాన్ని కచ్చితంగా పెంచి ఉండాలి. మరోవైపు, హెచ్‌1బీ వీసాదారుల కుటుంబసభ్యులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతినిచ్చే హెచ్‌4 వీసాలను పూర్తిగా రద్దు చేయనున్నట్టు తెలుస్తున్నది. స్టూడెంట్‌ వీసాల గడువుపై నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రతిపాదించింది. గడువు ముగిసిన తర్వాత విదేశీ విద్యార్థులను తిప్పి పంపాలని సూచించింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కొన్నాళ్ల పాటు ఉండి శిక్షణ పొందడానికి ఇచ్చే ఓపీటీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ప్రతిపాదించింది.


logo