మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 30, 2020 , 01:54:17

హెచ్‌1బీ ‘లాటరీ’కి స్వస్తి!

హెచ్‌1బీ ‘లాటరీ’కి స్వస్తి!

  • ఇకపై గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా వీసాల జారీ
  • ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదన

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29: అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. హెచ్‌1బీ వీసాల జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న ‘కంప్యూటర్‌ ఆధారిత లాటరీ వ్యవస్థ’ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా వీసాలు జారీచేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ను ఉంచింది. దీనిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు  30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలుపాలని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కోరింది. హెచ్‌1బీ అనేది నాన్‌ ఇమ్మిగ్రంట్‌ వీసా. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు ఈ వీసా వీలు కల్పిస్తుంది.  

కొత్త విధానం ఏమిటి?

హెచ్‌1బీ వీసాల జారీకి అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నది. దీని ద్వారా ఏటా 65వేల వీసాలను జారీ చేస్తున్నది. అయితే వీటి ద్వారా తక్కువ వేతనం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా కంపెనీలు నియమించుకుంటుండడంతో స్థానిక అమెరికన్లు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలోనే వీసా జారీ ప్రక్రియలో సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపింది.  తాజా ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఇకపై గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా వీసాలు జారీ చేస్తారు. అంటే అత్యధిక వేతనం లభించే ఉద్యోగులకు వీసా జారీలో ప్రాధాన్యం కల్పిస్తారు. దీని వల్ల నిపుణులైన ఉద్యోగులు మాత్రమే అమెరికాకు వచ్చే అవకాశం ఉన్నదని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు, స్థానికులకు ఉద్యోగ భద్రత లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నది. హెచ్‌1బీ, ఎల్‌1 వీసాల జారీని డిసెంబర్‌ 31 వరకు నిలిపివేస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.