శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 03:23:36

ట్రంప్‌ మూడంచెల ప్రణాళిక

ట్రంప్‌ మూడంచెల ప్రణాళిక

  • ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మార్గదర్శకాలు
  • మూడు విడుతలుగా లాక్‌డౌన్‌ ఎత్తివేత
  • రాష్ట్ర గవర్నర్లకే అధికారాలు అప్పగింత

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 17: కరోనా మహమ్మారితో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడంచెల ప్రణాళికను ఆవిష్కరించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను మూడు విడుతలుగా సడలించాలని ప్రతిపాదించారు. ఆ అధికారాన్ని ఆయా రాష్ర్టాల గవర్నర్లకే అప్పగించారు. గత వారం మరో 52 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశ కార్మిక విభాగం ప్రకటించిన రోజే ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా కారణంగా అమెరికాలో ఒక్క మార్చి నెలలోనే 2.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కాగా కరోనా వల్ల గత 24 గంటల్లో 4,591 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలోనే ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలు. 

తొలి విడుత: కరోనా నిర్ధారిత కేసులు, వైరస్‌ లక్షణాలున్న వారి సంఖ్య వరుసగా 14 రోజులపాటు తగ్గుముఖం పడితే ‘స్టే ఎట్‌ హోం’ (ఇంటికే పరిమితం కావడం) ఆంక్షలను ఎత్తివేయవచ్చు. 

రెండో విడుత: వైరస్‌ ముప్పు అధికంగా ఉన్నవారిని ఇండ్లకే పరిమితం చేయాలి. ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహించాలి. కామన్‌ ప్రదేశాలను మూసే ఉంచాలి. ఉద్యోగుల సాధారణ ప్రయాణాలకు అనుమతించవచ్చు. సామూహిక వేదికలను తెరువవచ్చు. కానీ నిర్ణీత దూరం పాటించడం తప్పనిసరి. 

మూడో విడుత: సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాలున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, నిర్ణీత దూరం తప్పక పాటించాలి. 

భారతసంతతి ఎంపీకి పదవి

అమెరికా లో కరోనా కట్టడి కోసం ఏర్పాటుచేసిన వైట్‌హౌస్‌ కరోనా వైరస్‌ సలహా మండలిలో డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ, భారతసంతతికి చెందిన ఆర్వో ఖన్నాకు చోటుదక్కింది. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల నుంచి నియమితులైన ఏకైక భారతసంతతి వ్యక్తి ఖన్నానే. 


logo