శుక్రవారం 10 జూలై 2020
International - Jan 29, 2020 , 02:22:31

భారత పర్యావరణ ఆర్థికవేత్తకు ‘టైలర్‌' అవార్డు

భారత పర్యావరణ ఆర్థికవేత్తకు ‘టైలర్‌' అవార్డు
  • జీవశాస్త్రవేత్త గ్రెచెన్‌ డైలీతో కలిపి పవన్‌ సుఖ్‌దేవ్‌ ఎంపిక
  • ‘హరిత ఆర్థికవ్యవస్థ’పై కృషికి దక్కిన గుర్తింపు

ఐరాస: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ‘హరిత ఆర్థిక వ్యవస్థ (గ్రీన్‌ ఎకానమీ)’ని ప్రతిపాదించిన ప్రముఖ భారత పర్యావరణ ఆర్థికవేత్త, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ప్రచారకర్త పవన్‌ సుఖ్‌దేవ్‌ (59)ను ‘2020 టైలర్‌' బహుమతి వరించింది. పర్యావరణానికి సంబంధించి దీన్ని నోబెల్‌ బహుమతిగా పరిగణిస్తారు. పర్యావరణ జీవశాస్త్రవేత్త గ్రెచెన్‌ డైలీతో కలిసి సుఖ్‌దేవ్‌ మే 1న ఈ బహుమతిని అందుకోనున్నారు.  ఈ బహుమతి కింద రెండు లక్షల అమెరికన్‌ డాలర్లను ఇద్దరూ పంచుకుంటారని టైలర్‌ బహుమతి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ  తెలిపింది. ఏప్రిల్‌లో న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంస్థలో జరిగే ఒక కార్యక్రమంలో తమ అధ్యయనంపై గ్రెచెన్‌ డైలీ, సుఖ్‌దేవ్‌ ప్రెజెంటేషన్‌ను సమర్పిస్తారు. పర్యావరణం దెబ్బ తింటుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడుతున్న దుష్ప్రభావాలను పవన్‌ సుఖ్‌దేవ్‌.. కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, రాజకీయ విధాన నిర్ణేతల దృష్టికి తెచ్చారు. యూఎన్‌ఈపీ అధినేత, ప్రత్యేక సలహాదారు సుఖ్‌దేవ్‌ ఆధ్వర్యంలో ‘గ్రీన్‌ ఎకానమీ ఇన్షియేటివ్‌' అనే ప్రాజెక్టును ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ప్రారంభించారు. వృద్ధిరేటుపై ఏమాత్రం భారం పడకుండా సంపద పెరుగుదల, ఉపాధి కల్పించడంతోపాటు పేదరిక నిర్మూలనకు ఛోదకశక్తిగా హరిత (గ్రీన్‌ ఎకానమీ) ఆర్థిక వ్యవస్థను తయారు చేయడానికి అవసరమైన విధి విధానాల రూపకల్పనే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘ది ఎకనమిక్స్‌ ఆఫ్‌ ఎకో సిస్టమ్స్‌ అండ్‌ బయో డైవర్సిటీ (టీఈఈబీ)’ అనే పేరుతో యూఎన్‌ఈపీ ఈ అధ్యయనం చేపట్టింది. గ్రీన్‌ ఎకానమీ మూవ్‌మెంట్‌కు టీఈఈబీ నివేదిక పునాది కానున్నందు వల్లే 2020 టైలర్‌ బహుమతికి సుఖ్‌దేవ్‌ ఎంపికయ్యారు. 


logo