శనివారం 30 మే 2020
International - Apr 04, 2020 , 01:22:13

సముద్రంలో మృత్యుఘోష

సముద్రంలో మృత్యుఘోష

-నౌకలనూ వదలని కరోనా మహమ్మారి

-19 నౌకల్లో 25 మంది వరకు మృత్యువాత

-వందల మందికి సోకిన కరోనా వైరస్‌

-సముద్రయానాలపై పలు దేశాలు నిషేధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కరోనా మహమ్మారి సముద్రజలాల్లోనూ కల్లోలం రేపింది. సరదాగా విహరిద్దామని వెళ్లిన యాత్రికులను పొట్టనపెట్టుకున్నది. డైమండ్‌ ప్రిన్సెస్‌, రూబీ ప్రిన్సెస్‌ నౌకల్లో పదుల సంఖ్యలో యాత్రికులు కరోనా బారినపడి మరణించడంతో సముద్రయానం అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొన్నది. దీంతో అనేకదేశాలు నౌకాయానంపై నిషేధం విధించాయి. కరోనా వల్ల నౌకల్లో నాలుగువారా ల్లోనే  25 మందివరకు మృత్యువాతపడ్డారు.

డైమండ్‌ ప్రిన్సెస్‌

జపాన్‌, తైవాన్‌, దక్షిణకొరియా దేశాల జలాల్లో విహరించాలని కోరుకునేవారు డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ప్రయాణించడాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు. జపాన్‌లోని యొకొహామా నుంచి ఈ ఏడాది జనవరి 20న 3,711 మంది ప్రయాణికులతో డైమండ్‌ ప్రిన్సెస్‌ బయల్దేరింది. అందులో జపాన్‌, కంబోడియా, హాంకాంగ్‌, ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, బ్రెజిల్‌, చిలీ, క్యూబా, ఫ్రాన్స్‌, రోమ్‌, హాలెండ్‌ తదితర ప్రాంతాలకు చెందినవారున్నారు. ఒక వ్యక్తి ఫిబ్రవరి ఒకటిన హాంకాంగ్‌లో దిగి దవాఖానకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఫిబ్రవరి నెల మొత్తం ప్రయాణికులందరినీ నౌకలోనే క్వారంటైన్‌లో ఉం చింది. దీంతో రోజుకు కొందరు చొప్పున కరోనా బారిన పడటం మొదలైంది. ఫిబ్రవరి 7న 61 మందికి, 8న ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. తిరిగి 9న ఆరుగురికి, 10న ఏకంగా 60మందికి కరోనా సోకింది. మార్చి ప్రారంభం నాటికి 712 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ అని తేలినట్టు అధికారులు వెల్లడించారు. అనగా నౌకలోని 19.2 శాతం మంది కరోనా బారినపడ్డారని తేలింది. వ్యాధికి గురైన వారిలో ఫిబ్రవరి 20 నుంచి 25 మధ్య నలుగురు జపనీయులు మరణించారు. ఫిబ్రవరి 28న ఒక ఆంగ్లేయుడు, ఆ తరువాత వరుసగా ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, కెనడా దేశస్థులు మృత్యువాతపడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. జర్మన్‌ ప్రభుత్వం తక్షణమే తమ క్రూయిజ్‌ నౌకల విహారయాత్రలను రద్దుచేసింది. వీకింగ్‌ సంస్థ కూడా క్రూయిజ్‌ యాత్రలను నిలిపివేసింది. 

ఫ్లోరిడాలో లంగరేసిన జాండామ్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌ నుంచి 1829 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరిన హాలెండ్‌  క్రూయిజ్‌షిప్‌  జాండామ్‌  కరోనా బారిన పడింది. ఆ నౌకను చీలీ తమ నౌకాశ్రయంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో నౌకను పనామా కెనాల్‌ మీదుగా దారి మళ్లించారు. మార్గమధ్యలోనే నలుగురు ప్రయాణికులు మరణించారు. హాలెండ్‌ అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవడంతో ఫ్లోరిడా గవర్నర్‌ ఆ నౌకను తమ నౌకాశ్రయంలో లంగరేసేందుకు అంగీకరించారు. కెనడా, బ్రిటన్‌ ప్రభుత్వాలు తమ పౌరులను రక్షించి దవాఖానల్లో చేర్పించాయి. మొత్తంగా ఆ నౌకలో ప్రయాణించిన వారిలో 576మంది కరోనా బారిన పడ్డారు. 

  • విదేశాల నుంచి వచ్చే నౌకలపై ఆస్ట్రేలియా మార్చి 15 నుంచి నిషేధం విధించింది. అయితే రూబీ ప్రిన్సెస్‌కు మాత్రం మినహాయింపునిచ్చింది. సిడ్నీ నుంచి న్యూజిలాండ్‌ బయల్దేరిన రూబీలో 3,800 మంది ఉండగా, వారిలో 576 మందికి కరోనా సోకింది. వీరిలో ఐదుగురు మరణించారు.
  • కాలిఫోర్నియాకు చెందిన గ్రాండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో 3,533 మంది ఉండగా, వారిలో 103 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు.
  • ఫ్రాన్స్‌కు చెందిన కాస్టా లుమినాసా నౌకలో 1780 మందితో బయల్దేరింది. వీరిలో ముగ్గురికి కరోనా సోకగా, ఒకరు మరణించారు. logo