సోమవారం 13 జూలై 2020
International - Jun 24, 2020 , 03:16:04

హెచ్‌1బీపై ట్రంప్‌ కత్తి

హెచ్‌1బీపై ట్రంప్‌ కత్తి

  • వీసాల జారీపై తాత్కాలిక నిషేధం
  • ఈ ఏడాది చివరి వరకు నిలిపివేత
  • ఇతర వర్క్‌ వీసాలు కూడా రద్దు
  • ఎన్నికల వేళ ట్రంప్‌ కీలక నిర్ణయం
  • భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం
  • ట్రంప్‌ నిర్ణయంతో హెచ్‌1బీతోపాటు 
  • పలు క్యాటగిరీల వీసాదారులకు దెబ్బ
  • బాధితుల్లో అత్యధికులు భారతీయ నిపుణులే

వాషింగ్టన్‌, జూన్‌ 23: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌1బీతోపాటు ఇతర పని ఆధారిత వీసాలపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధించారు. అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఇది అమల్లోకి రానున్నది. ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (అమెరికాలో అక్టోబర్‌ 1 నుంచి మొదలు) హెచ్‌1బీ వీసాలను జారీచేసిన పలు అమెరికా, భారతీయ కంపెనీలపైనా ట్రంప్‌ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం పడనుంది. వీసాలు ఆమోదం పొందేందుకు ఈ ఏడాది ఆఖరి వరకు వారు వేచిచూడాల్సి ఉంటుంది.

మరోవైపు, హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులపైనా ఇది ప్రభావం చూపనుంది. హెచ్‌1బీ అనేది నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. దీని ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కలుగుతుంది. మరోవైపు, అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల జారీని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా ట్రంప్‌ ఈ ఏడాది చివరివరకు పొడిగించారు. హెచ్‌1బీ వీసా జారీ ప్రక్రియను సంస్కరించాలని, లాటరీ విధానం స్థానంలో ‘ప్రతిభ ఆధారిత’ వలస విధానం తీసుకురావాలని అధికారులను ట్రంప్‌ ఆదేశించారు. హెచ్‌1బీలపై తాత్కాలిక నిషేధం అనంతరం ఆయన ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు శ్వేతసౌధం తెలిపింది. సంస్కరణల్లో భాగంగా.. గరిష్ఠ వేతనం పొందే నిపుణులకు హెచ్‌1బీ జారీలో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఏటా 85,000 హెచ్‌1బీ వీసాలను జారీచేస్తుంది. వీటికి పోటీపడేవారిలో అత్యధికులు భారతీయులే. 

అమెరికన్లను ఆదుకునేందుకే: ట్రంప్‌

కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన లక్షల మంది అమెరికన్లను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అని ట్రంప్‌ పేర్కొన్నారు. నిరుద్యోగిత రేటు గరిష్ఠస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా లేబర్‌ మార్కెట్‌పై విదేశీ ఉద్యోగుల ప్రభావాన్ని గుర్తెరగాలని చెప్పారు. ఫిబ్రవరి, మే మధ్య కాలంలో దేశంలో నిరుద్యోగిత రేటు దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. ‘దేశంలో ప్రతి రంగంలోనూ అమెరికన్లు విదేశీ ఉద్యోగులతో పోటీ పడాల్సి వస్తున్నది. తాత్కాలిక ఉద్యోగాల కోసం వస్తున్న లక్షల మంది కార్మికులతోనూ వారు ఎదురీదాల్సి వస్తున్నది. సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యోగుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో అమెరికన్ల ఉద్యోగాలకు వీరి వల్ల తీవ్ర ముప్పు ఏర్పడుతున్నది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా అమెరికాలో దాదాపు 5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో 5.25 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. 

కార్పొరేట్‌, చట్టసభ సభ్యుల ఆగ్రహం

హెచ్‌1బీతోపాటు, ఇతర వర్క్‌ వీసాలను నిలిపివేస్తూ ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ చట్టసభ సభ్యులు, కార్పొరేట్లు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక ప్రగతికి వలసదారులు ఎంతో దోహదపడుతున్నారని, తాజా నిర్ణయంతో ఆర్థకవ్యవస్థ బలహీనపడుతుందని హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఆర్థిక ప్రగతికి వలస విధానం ఎంతో తోడ్పడింది. సాంకేతిక రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా నిలిపింది. నేడు గూగుల్‌ ఇలా ఉన్నదంటే.. అందుకు వలసదారులే కారణం. ఈ రోజు వెలువడిన ఉత్తర్వులు అసంతృప్తికి గురిచేశాయి. అయినప్పటికీ వలసదారులకు మేం అండగా ఉంటాం. అందరికీ అవకాశాల కల్పనకు కృషి చేస్తాం. 


-సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ సీఈవో


logo