శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 01:28:43

దడ లేకుండా బడికి!

దడ లేకుండా బడికి!

కరోనా దెబ్బకు మానవ జీవన ముఖచిత్రంతోపాటూ బడి స్వరూపమూ మారిపోయింది. విద్యారంగానికి కొవిడ్‌ కొత్త పాఠాలు నేర్పింది. బోధన, పాఠ్యప్రణాళిక, ప్రాజెక్టువర్కులు... ఇలా అన్ని అంశాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది. కరోనా నుంచి కాస్త తెరిపినపడిన దేశాలు కూడా.. మళ్లీ వైరస్‌ వ్యాప్తికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలను తెరిచి తరగతులను నిర్వహిస్తున్నాయి. మనదేశంలోనూ విద్యాసంస్థలను తిరిగి తెరువటంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయాదేశాల్లో పాటిస్తున్న జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.. 

చైనా.. సొంతవాహనాల్లో రావాలి  

ఏప్రిల్‌లోనే చైనాలో ఉన్నత పాఠశాలలను పునఃప్రారంభించారు. గత మంగళవారం నుంచి కిండర్‌గార్టెన్‌తో పాటు అన్ని స్థాయిల బడులను పూర్తిస్థాయిలో తెరిచారు. సొంతవాహనాల్లోనే బడికి రావాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రతను పాఠశాల యాజమాన్యం రోజూ రికార్డు చేయాలి. మాస్కులను, శానిటైజర్‌ బాటిళ్లను అన్ని బడులు అదనంగా సమకూర్చుకోవాలి. వివిధ కార్యక్రమాల పేరుతో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు స్కూళ్లను సందర్శించవద్దు. కరోనా వైరస్‌ పుట్టిల్లయిన వుహాన్‌లో పాఠశాలలను మంగళవారం నుంచి తెరువనున్నారు.

డెన్మార్క్‌..  బృందాలుగా విద్యార్థులు  

డెన్మార్క్‌లో మే రెండో వారంలో పాఠశాలలు తెరిచారు. స్కూల్‌ గేటు దగ్గరే విద్యార్థులకు టెంపరేచర్‌ చెక్‌ను తప్పనిసరి చేశారు. వైరస్‌ లక్షణాలు లేని విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థుల ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసి డజను మంది చొప్పున ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాల్ని ‘ప్రొటెక్టివ్‌ బబుల్స్‌'గా వ్యవహరిస్తున్నారు. తరగతులుగానీ, ఆటలు గానీ ఈ బృందాల వారీగానే నిర్వహిస్తున్నారు.

జపాన్‌.. రోజు విడిచి రోజు పాఠాలు 

జపాన్‌లో జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఒక్కో తరగతిలో విద్యార్థులను రెండు బ్యాచులుగా విభజించారు. రోజువిడిచిరోజు ఒక్కో బ్యాచ్‌ కు పాఠాలు చెబుతున్నారు. పాఠశాలలోకి ప్రవేశించే ముందు రోజూ విద్యార్థులకు శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. కరోనా ఎలా వ్యాపిస్తుంది? ఎలా కట్టడి చేయాలి? అనే విషయాలపై 3-డీ దృశ్యమాధ్యమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జర్మనీలో కూడా దాదాపు ఇవే నిబంధనల్ని అమలు చేస్తున్నారు.

శ్రీలంకలో... సరి-బేసి విధానం 

ఈ నెల తొలివారంలో శ్రీలంకలో పాఠశాలలు తెరుచుకున్నాయి. 200 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకే సమయంలో విద్యార్థులు గుమిగూడకుండా సరి-బేసి విధానాన్ని అవలంభించారు. దీనిప్రకారం విద్యార్థులకు నంబర్లను కేటాయిస్తారు. సరి సంఖ్య ఉన్న విద్యార్థులకు ఉదయం తరగతులు, బేసి సంఖ్య విద్యార్థులకు మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తున్నారు. స్కూల్‌ క్యాంటీన్లు తెరిచేందుకు అనుమతించలేదు. అవుట్‌డోర్‌, ఇండోర్‌ క్రీడలను నిషేధించారు. 

ఉరుగ్వేలో గ్రామాలతో షురూ 

ఉరుగ్వేలో ఏప్రిల్‌లోనే పాఠశాలలను ప్రారంభించారు. ముందుగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్‌ తెరిచారు. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలు లేని విద్యార్థులకు పాఠశాలల్లో తరగతులు నిర్వహించారు. మిగిలిన విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు జరుపుతున్నారు. వైరస్‌ కేసులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో దశలవారీగా స్కూల్స్‌ ప్రారంభించారు.

థాయిలాండ్‌లో గాజు ఫలకలే రక్ష 

థాయిలాండ్‌లో జూలై రెండో వారంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కూర్చునే కుర్చీ, డెస్కుల చుట్టూ ప్రత్యేక గాజు ఫలకలను అమర్చారు. ఒక్కో డెస్కు మధ్య ఆరడుగుల దూరం ఉండేలా జాగ్రత్త పడ్డారు. డ్రిల్‌ సమయంలో ప్రీప్రైమరీ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక బాక్సులను అమర్చి, అందులోనే చిన్నారులు బొమ్మలతో ఆడుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు చేతులు కడుక్కున్న తర్వాత వాష్‌బేసిన్‌తోపాటు, నిల్చున్న ప్రదేశాన్ని శానిటైజ్‌ చేయడం, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడికక్కడ విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను రికార్డు చేసే టన్నెల్‌ స్కానర్ల ఏర్పాటు వంటి జాగ్రత్తలను పాటించారు. 

స్విట్జర్లాండ్‌లో మాస్కు లేకుంటే సస్పెన్షన్‌  

మే చివరివారంలో స్విట్జర్లాండ్‌లో స్కూల్స్‌ తెరిచారు. పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునే డెస్కుల మధ్య మీటరు దూరం పాటించారు. తరగతిలో విద్యార్థుల సంఖ్యను సగం సగం చొప్పున రెండు సెక్షన్లుగా మార్చారు. ఒక్కో సెక్షన్‌కు వేర్వేరు సమయాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. స్కూలు ప్రాంగణంలో మాస్కులు ధరించని పైతరగతుల విద్యార్థులపై కొన్ని పాఠశాలలు వారం పాటు సస్పెన్షన్‌ను విధిస్తున్నాయి. 


logo