శుక్రవారం 03 జూలై 2020
International - May 27, 2020 , 03:40:45

మానవాళి ముంగిట్లో పెను ముప్పు

 మానవాళి ముంగిట్లో పెను ముప్పు

  • ఇప్పటి వరకూ వైరస్‌ల ప్రభావం గోరంతే
  • వుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ షీ ఝెంగ్లీ

బీజింగ్‌: మున్ముందు మానవాళిపై వైరస్‌లు పెద్ద ఎత్తున దాడి చేయనున్నాయని చైనాలోని వుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌, ‘చైనా బ్యాట్‌ ఉమన్‌'గా ప్రఖ్యాతిగాంచిన షీ ఝెంగ్లీ హెచ్చరించారు. ఇంతవరకూ బయటపడని వైరస్‌లు కలుగజేసే రోగాలబారి నుంచి మనుషులను రక్షించాలంటే వాటి గురించి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇప్పటివరకూ కనుగొన్న వైరస్‌లు అత్యంత అల్పమని, కనుగొనాల్సిన వైరస్‌లు ఇంకా చాలా ఉన్నాయని, వాటితో పెద్ద ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. చైనాలోని ఓ  టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం ఆమె మాట్లాడారు. అంటువ్యాధులపై పోరుకు అంతర్జాతీయ సమాజం మధ్య సహకారం అవసరమన్నారు. వైరస్‌లపై పరిశోధన జరిపేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య పారదర్శకత, సహకారం అవసరమని, సైన్స్‌ను రాజకీయం చేయడం విచారకరమని తెలిపారు. ‘మున్ముందు మానవులు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే, జంతువుల్లో ఇప్పటివరకూ బయటపడని వైరస్‌ల గురించి అధ్యయనం చేయాలి. వాటి గురించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి’ అని ఝెంగ్లీ అన్నారు. వాటిపై సరైన అధ్యయనం జరుపకుంటే మానవాళిపై మరో మహమ్మారి దాడి చేసేందుకు అవకాశం ఉన్నదని హెచ్చరించారు. తాను పరిశోధనలు సాగిస్తున్న వైరస్‌లలోని జన్యు లక్షణాలు, కరోనా వైరస్‌ లక్షణాలతో సరిపోడంలేదని స్పష్టం చేశారు. కరోనా తమ ల్యాబ్‌లోనే పుట్టిందన్న వార్తలను తోసిపుచ్చారు. 

చైనా బ్యాట్‌ ఉమన్‌.. షీ ఝెంగ్లీ 

గబ్బిలాల్లో కరోనా వైరస్‌ ప్రభావంపై పరిశోధన చేస్తున్నందుకు షీ ఝెంగ్లీకి ‘చైనా బ్యాట్‌ ఉమన్‌' అనే పేరు వచ్చింది. 2003లో సార్స్‌ వ్యాధి విజృంభించింది. వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు పది శాతం మంది మరణించారు. ‘సార్స్‌'కు వ్యాక్సిన్‌ను కనిపెట్టే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల బృందంతో ఝెంగ్లీ కలిసి పనిచేశారు. ఈక్రమంలో చైనాలోని యునాన్‌, నానింగ్‌ తదితర నగరాల శివారుల్లో ఉన్న గుహల్లోని గబ్బిలాలపై ఆమె పరిశోధనలు నిర్వహించారు. ‘సార్స్‌' వ్యాధికి కారణమైన వైరస్‌ గబ్బిలాల నుంచే సంక్రమించిందని నిర్ధారించారు. ఈ ఫలితాలు సార్స్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారి మూలాల్ని తెలుసుకోవడానికి ఆమె చేస్తున్న పరిశోధనల్ని నిపుణులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.


logo