శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 18:28:57

అమ్మా చనిపోవాలని ఉంది... కత్తో, తాడో ఇవ్వు

అమ్మా చనిపోవాలని ఉంది... కత్తో, తాడో ఇవ్వు

హైదరాబాద్‌ : బాడీ షేమింగ్‌. ఓ వ్యక్తి శరీరాకృతిని, రూపును చూపిస్తూ వెక్కిరింపులకు గురిచేయడం. చేసేవాళ్లకు అది సరదాగా ఉన్నప్పటికీ అనుభవించేవాళ్లకు మాత్రం నరకంలా ఉంటుంది. ఒంటి రంగును, రూపును చూసి మనుషులను జడ్జ్‌ చేస్తారు కొందరు. ఎగతాళి చేస్తుంటారు. సాటివారి మనసును నొప్పిస్తూ అనందాన్ని పొందుతుంటారు. వారు ఎంతగా కుమిలిపోతున్నారో వీరికి అనవసరం. మనసును కలిచివేసే ఇటువంటి ఘటనే ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో చోటుచేసుకుంది. మరుగుజ్జు తనమే ఓ విద్యార్థి తీవ్ర వేదనకు కారణమైంది. తట్టుకోలేని ఆ వేదన ఆత్మహత్య చేసుకోవాలనేంతగా ఆలోచనకు దారితీసింది. క్వాడేన్‌ బేల్స్‌(9) మరుగుజ్జుతనంతో జన్మించాడు. ఈ మరుగుజ్జుతనం కారణంగా అవమానాలు ఎదుర్కోవడం నిత్యకృత్యమైంది. పాఠశాలలోని తోటి విద్యార్థులు సైతం క్వాడేన్‌ను బాగా అవమానించేవారు. ఈ విషయాలను తల్లి యర్రాకాతో పంచుకునేవాడు. 

ఇలా చెప్పిన ప్రతీసారి తల్లి కుర్రాడిని అనునయిస్తూ సముదాయించేది. అటువంటి వ్యక్తుల మాటలను పట్టించుకోవద్దని,  విస్మరించాల్సిందిగా సూచిస్తుండేది. కాగా పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువయ్యాయి. గడిచిన బుధవారం సైతం క్వాడెనును తీవ్రంగా అవమానించారు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ రోజు సాయంత్రం స్కూల్‌ నుంచి తీసుకువెళ్లేందుకు తల్లి యర్రాక పాఠశాల వద్దకు వచ్చింది. కారులో కూర్చున్న యర్రాక ఏడవటం ప్రారంభించాడు. ఏమైందని అడగగా మరచిపోలేకుండా ఉన్న తోటి విద్యార్థుల ఎగతాళిని తల్లితో చెబుతూ తనకు చనిపోవాలని ఉందని తెలిపాడు. తాడు ఇవ్వండి ఉరేసుకుంటా... కత్తి ఇవ్వండి పొడుచుకుని చనిపోతా లేదా ఎవరైనా నన్ను చంపేయండి.. నాకు చనిపోవాలనుందంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కొడుకు వేదనను తల్లి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌ అయింది. ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపింది.logo