మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 03:05:51

కరోనా సోకని దీవి

కరోనా సోకని దీవి

  • కరోనాకు లొంగని గిగ్లియో ఐల్యాండ్‌
  • దీవిలోని ఏ ఒక్కరికీ ఇంతవరకూ వైరస్‌ సోకలేదు
  • కొవిడ్‌ బాధితులు పర్యటించినా మహమ్మారి ఊసే లేదు

190కి పైగా దేశాల్లోకి చాపకింద నీరులా ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా.. 1,500 మంది జనాభా కూడా లేని ఓ ద్వీపాన్ని ఏమీ చేయలేకపోయింది. ద్వీపం అంటున్నారు కదా! సముద్రంలో ఉంటుంది. వైరస్‌ రోగులు అక్కడికి వెళ్లలేదేమో అని అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు. వ్యాధిబారిన పడ్డ ముగ్గురు ఆ దీవిలో పర్యటించడమే కాదు. జనాల్లో తిరిగారు. కలిసి తిన్నారు. అయినా దీవిలో ఒక్కరికీ మహమ్మారి సోకలేదు. ఇది ఆ దీవి ప్రజల అదృష్టమో? లేక జన్యు పరిణామ క్రమంలోని విశిష్టతో? తెలుసుకోవడానికి పరిశోధకులు తలమునకలవుతున్నారు. 

రోమ్‌: ఇటలీకి చెందిన ద్వీప సమూహాల్లో గిగ్లియో ద్వీపం ఒకటి. దీవిలో దాదాపు 1,500 మంది స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి ప్రజల్లో ఉన్న విచిత్రమైన లక్షణమేమిటంటే, దీవిలో ఎవరైనా ఒక్కరు జబ్బు పడినా, అది దావానలంలా వ్యాపించి ఐల్యాండ్‌లోని అందరికీ అంటుకుంటుంది. పిల్లా, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేదు. తట్టు, ధనుర్వాతం వంటి వ్యాధులు గతంలో ఇలాగే వ్యాపించాయి. ఇటలీకి దూరంగా ఏకాంతంగా ఉండటం చేత సముద్రపు దొంగల దాడులు దీవిపైన తరుచుగా జరుగుతుండేవి. అందుకే దీవిలోని చాలా వరకు ఇండ్లు దగ్గరదగ్గరగా ఉంటాయి. వీధులు కూడా ఇరుగ్గా ఉంటాయి. గతేడాది చివర్లో చైనాలో కరోనా వెలుగు చూసింది. అనతికాలంలోనే ఐరోపాకు వ్యాపించింది. ఒకవేళ మహమ్మారి గిగ్లియాకు వ్యాపిస్తే దీవి అంతా శ్మశానంగా మారడం ఖాయమని అందరూ భావించారు. అయితే అలా జరుగలేదు. అలా అని ఆ దీవిలో లాక్‌డౌన్‌ వంటి చర్యలు కూడా చేపట్టలేదు.

సామర్థ్యం లేకపోవచ్చు!

గిగ్లియో దీవిలోని వారికి వైరస్‌ సోకకపోవడంపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. వ్యాధి సోకినప్పటికీ కొందరు రోగులు వైరస్‌ను వ్యాపింపజేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చని, ఈ కారణంగానే గిగ్లియో దీవిలో పర్యటించిన ముగ్గురు వ్యక్తుల వల్ల అక్కడి స్థానికులకు వైరస్‌ వ్యాపించలేదని రోమ్‌లోని టోర్‌ వెర్గటా దవాఖాన అంటువ్యాధుల నిపుణులు మాసిమో ఆండ్రియాని అన్నారు. గిగ్లియో ప్రజలకు వైరస్‌ సోకకపోవడానికి కారణం అక్కడి వారి జన్యు పరిణామక్రమంలోని విశిష్టతేనని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డానియల్‌ ఆల్టమన్‌ అన్నారు. విభిన్న జాతుల మధ్య వివాహాలు గిగ్లియోలో సాధారణమని, దీంతో జన్యు సంక్రమణలో రూపాంతరం జరుగవచ్చని చెప్పారు. వైరస్‌ సోకకపోవడం అదృష్టమని కూడా చెప్పొచ్చని అన్నారు. కాగా దీవిలోని ప్రజలపై వైరస్‌ ప్రభావం చూపకపోవడానికి కారణాలపై అధ్యయనం చేస్తానని ముటి వివరించారు.

దీవినంతా చుట్టేవారు

ఫిబ్రవరి 18న ఇటలీ నుంచి ఓ అరవై ఏండ్ల వ్యక్తి గిగ్లియో దీవికి ఓ పడవలో వచ్చాడు. ద్వీపంలో నివసిస్తున్న తన బందువుల ఇంట్లో ఎవరో చనిపోతే అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చాడు. కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తర్వాత దీవిలోని సుందర ప్రదేశాల్లో పర్యటించి వెళ్లాడు. ఇటలీకి వెళ్లిన మూడు వారాలకు ఆ వ్యక్తి మరణించాడు. ఫిబ్రవరి 18కి ముందే ఆయనకు కరోనా సోకినట్టు తేలింది. అంటే వైరస్‌ ఉండగానే దీవి మొత్తం ఆయన చుట్టేశాడు. ఇలాగే మరో ఇద్దరు కరోనా రోగులు (ఇతర దేశస్థులు) దీవిలోని జనాలతో కలియదిరిగారు. ఆ తర్వాత వారికి వైరస్‌ ఉన్నట్టు తేలింది. పరిస్థితులను గమనించిన  క్యాన్సర్‌ పరిశోధకురాలు ముటి ఇటలీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఇటలీలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో అధికారులు అంత వేగంగా స్పందించలేదు. ముటిలో ఆందోళన పెరుగసాగింది. రోజులు గడుస్తున్నాయి. అయితే, దీవిలోని ఏ ఒక్కరిలో వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదు. జూన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో ఇటలీ ప్రభుత్వం గిగ్లియో దీవికి యాంటీబాడీ టెస్టు కిట్‌లను పంపించింది. పరీక్షలు నిర్వహించగా.. అనూహ్యంగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.


logo