సోమవారం 25 మే 2020
International - Mar 29, 2020 , 21:46:37

కరోనా కల్లోలం: జర్మనీలో హెస్సీ రాష్ట్రమంత్రి ఆత్మహత్య

కరోనా కల్లోలం: జర్మనీలో హెస్సీ రాష్ట్రమంత్రి ఆత్మహత్య

హైదరాబాద్: కరోనా సంక్షోభం జర్మనీ లోని హెస్సీ రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాయఫర్‌ (54)ను బలిగొన్నది. ఆయన మృతదేహం రైలుపట్టాల దగ్గర  లభించింది. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం గట్టెక్కడం గురించి ఆందోళనకు గురైన షాయఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. హెస్సీ రాష్ట్ర ప్రభుత్వాధినేత పోల్కర్ బూఫియర్ ఆదివారం ఈ సంగతి అధికారికంగా ప్రకటించారు. "ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. అన్నిటికి మించి తీవ్రమైన విషాదం కలిగించే అంశం" అని ఆందోళన నిండిన స్వరంతో ఆయన పేర్కొన్నారు. పదేళ్లుగా ఆర్థికమంత్రిగా ఉన్న షాయఫర్ కరోనా సంక్షోభం తలెత్తినప్పటి నుంచి కంపెనీలను, కార్మికులను ఆర్థికసంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రాత్రి పగలు కృషి చేశారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గురించి  ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని భావిస్తున్నట్టు బూఫియర్ చెప్పారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుతం సంక్షోభ సమయంలో కోల్పోవడం తీవ్రమైన లోటు అన్నారు. బూఫియర్ వారసునిగా హెస్సీ రాష్ట్ర పగ్గాలు చేపడతారనుకున్న షాయఫర్ మరణం జర్మనీ రాజకీయాలను కుదిపేసింది. జర్మనీ ఆర్థిక రాజధానిగా భావించే ఫ్రాంక్‌ఫర్ట్ ఉన్నది హెస్సీ రాష్ట్రంలోనే. జర్మనీ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన డోయిషె బ్యాంక్, కామర్జ్ బ్యాంక్ వంటివి ఉన్నది ఈ నగరంలోనే. యూరప్ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా ఈ నగరంలోనే ఉంది.


logo