శనివారం 30 మే 2020
International - May 12, 2020 , 15:36:25

55 రోజులుగా ఎయిర్‌పోర్టులో నివాసం

55 రోజులుగా ఎయిర్‌పోర్టులో నివాసం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇండియాలో చిక్కుకుపోయిన ఓ జర్మన్‌ యువకుడు గత 55 రోజులుగా న్యూఢిల్లీలోని  ఇందిరాగాంధీ  అంతర్జాతీయ విమానాశ్రయంలో నివాసమున్నాడు. మంగళవారం ఉదయం కేఎల్‌ఎం విమానంలో ఆయన ఆమెస్టర్‌డమ్‌కు బయల్దేరి వెళ్లాడు. ఈయనతోపాటు మరో 291 మందిని కూడా ఆ విమానం ఆమెస్టర్‌డమ్‌కు తీసుకెళ్లింది. విమానం బయల్దేరే ముందు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఎడ్గర్డ్‌ జెబార్ట్‌ను విమానాశ్రయం అధికారులు కోరగా.. నివాసం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా  పేర్కొన్నాడు.

ఇస్తాంబుల్‌ వెళ్లే మార్గంలో మార్చి 18న హనోయి నుంచి న్యూఢిల్లీ చేరుకొన్న జెబార్ట్‌.. అప్పటినుంచి మంగళవారం వరకు ఇదే విమానాశ్రయంలో ఉన్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందడంతో అన్ని దేశాల విమానాల రాకపోకలను భారత్‌ నిషేధించడంతో జెబార్ట్‌ ఇక్కడే చిక్కుకుపోయాడు. ఆయన వద్ద భారత వీసా లేకపోవడంతో విమానాశ్రయం నుంచి బయటకు రాలేకపోయాడు. జర్మనీలో ముందస్తు క్రిమినల్‌ రికార్డు ఉండటంతో అతడు భారత వీసా పొందే అవకాశం లేదని, అందుకే దరఖాస్తు చేసుకోలేదని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు.


logo