శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 10, 2020 , 17:21:14

భారతీయ గే జంట.. అమెరికాలో పెండ్లాడారు

భారతీయ గే జంట.. అమెరికాలో పెండ్లాడారు

న్యూజెర్సీ: వారిద్దరు పురుషులు.. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.. విడివిడిగా ఉండటం ఇష్టం లేక కలిసి బ్రతుకాలని నిర్ణయించుకున్నారు. అంతే, సాంప్రదాయబద్దంగా పెండ్లి చేసుకున్నారు. వారే ఇండియాకు చెందిన అమిత్ షా, ఆదిత్య మాదిరాజు. న్యూజెర్సీ నగరంలోని ఒక ఆలయంలో కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. వీరి వివాహం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది.

అమిత్‌షా, ఆదిత్య మాదిరాజు మొదట ఒకరినొకరు ఒక సాధారణ స్నేహితుడి ద్వారా 2016 లో కలుసుకున్నారు. "మూడు సంవత్సరాల క్రితం స్నేహితుడి పుట్టినరోజున ఒక చిన్న లోయర్ ఈస్ట్ సైడ్ బార్‌లో కలుసుకున్నాం. ఆరోజు నుంచి ఇద్దరి మధ్య ఏదో అనుబంధం పెనవేసుకున్నది. నాటి నుంచి నేటి వరకు ఒక్కటిగా ఉన్నాం. విడిగా ఉండలేక పెళ్లి చేసుకున్నాం" అని అమిత్‌షా చెప్పారు. 

పెళ్లికి ముందు ఈ జంట తమ ప్రియమైనవారితో మెహెందీ వంటి సాంప్రదాయ వేడుకలు జరుపుకున్నారు. వీరి పెండ్లికి వీరిద్దరి తల్లులు భారత్‌ నుంచి వచ్చి ఆశీర్వాదం అందజేయడం విశేషం. వివాహం తరువాత, నూతన జంట అమిత్, ఆదిత్యలు కాక్టెయిల్-నేపథ్య సంగీత పార్టీని గొప్పగా ఇచ్చారు. తక్కువ మంది బంధువులు, స్నేహితులు ఈ ఫంక్షన్‌కు హజరయ్యారు. "ఒక ఆలయంలో జరిగిన సాధారణ వివాహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూస్తారని గ్రహించలేదు" అని అమిత్‌ చెప్పారు. ఇంటర్నెట్‌లో వీరి వివాహానికి హృదయపూర్వక ప్రతిస్పందనలు వచ్చాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.