శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 14:59:20

తోటలో గొయ్యి తవ్వుతుండగా బయటపడ్డ మృతదేహాలు..ఏడు వేల ఏళ్ల కిందటిదట..!

తోటలో గొయ్యి తవ్వుతుండగా బయటపడ్డ మృతదేహాలు..ఏడు వేల ఏళ్ల కిందటిదట..!

మాస్కో: తోటలో కంపోస్ట్‌ గొయ్యి తవ్వుతున్న ఇద్దరు తండ్రీకొడుకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్దిలోతు తవ్వగానే ఎముకలు కనిపించాయి. దీంతో తేరుకున్న తండ్రి ఇంకాస్త తవ్వగా ఇద్దరు పెద్దలు, ఒక బాలుడి మృతదేహం కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా, అవి పురాతన మానవుల మృతదేహాలని గుర్తించి, పురావస్తు శాస్త్రవేత్తలను పిలిచి చూపించారు. వారు ఆ మృతదేహాలు ఏడు వేల ఏళ్ల కిందటి ‘నియోలిథిక్‌ కుటుంబాని’కి చెందినవారివని తేల్చారు. 

ఈ సంఘటన రష్యాలోని బురియాటియా రీజియన్‌లోని జెలెన్‌ఖోజ్ గ్రామంలో జరిగింది. అలెక్సీ అగోష్కోవ్, అతడి కొడుకు ఇవాన్ కలిసి గొయ్యి తవ్వుతుండగా, ఇద్దరు పెద్దల మధ్య ఉన్న పిల్లవాడి మృతదేహాలను గుర్తించారు. పెద్దలలో ఒకరికి పుర్రెపై రాతి ఉంగరం, మణికట్టు మీద షెల్ బ్రాస్‌లెట్‌ అవశేషాలున్నాయి. పిల్లడాడి ఎడమ చేతిలో ఎముక సూది ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.  ఈ ప్రదేశంలోనే ఈ ఆవిష్కరణ మొదటిదని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే పురాతన స్థావరాలకు నిలయమైన స్థలమని తెలిపారు. ఈ మృతహాలపై అధ్యయనం చేస్తున్నామని, వారి వయస్సు, లింగం,  జాతిని తెలుసుకుంటామని వారు పేర్కొన్నారు.  పురాతన మానవుల జీవనశైలి గురించి ఇది తమకు తెలియజేయనుందని వారు భావిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo