బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 13, 2020 , 03:45:54

డిగో.. భారీ తాబేళ్ల జాతిపిత

డిగో.. భారీ తాబేళ్ల జాతిపిత

కాలిఫోర్నియా: అంతరించిపోతున్న జాతిని కాపాడేండుకు ఓ భారీ తాబేలు తన జీవితాన్ని ధారపోసింది. 60 ఏండ్ల తర్వాత ఇప్పుడు సగర్వంగా పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఆ తాబేలు పేరు డిగో.. వయసు వందేండ్లు. ఈక్వెడార్‌లోని గాలపాగోస్‌ దీవుల్లో ఉన్న ఎస్పానోలా ప్రాంతం దాని స్వస్థలం. గతంలో ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 50 ఏండ్ల కిందట ఈ భారీ తాబేళ్లు 14 మాత్రమే ఉండేవి. అందులో రెండు మగవి కాగా, 12 ఆడ తాబేళ్లు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతులను రక్షించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు 1960లో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా 14 మగ తాబేళ్లను ఎంపికచేసి కాలిఫోర్నియాలోని శాంటాక్లాజ్‌ దీవుల్లో ఉన్న శాండియాగో జూకు తరలించారు. ఇందులో డిగో తాబేలు కూడా ఒకటి. ఈ ప్రాజెక్టులో భాగంగా గత 50 ఏండ్లలో దాదాపు రెండు వేల భారీ తాబేళ్లు జన్మించగా.. అందులో 800 తాబేళ్లకు డిగోనే తండ్రి కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూర్తయింది. తన జాతిని రక్షించే బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన డిగో ఇప్పుడు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. శాస్త్రవేత్తలు డిగోను ఈ ఏడాది మార్చిలో దాని స్వస్థమైన గాలపాగోస్‌ దీవుల్లోని ఎస్పానోలాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పానోలాలో ప్రస్తుతం 1800 తాబేళ్లు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 40 శాతం తాబేళ్లకు డిగోనే మూలపురుషుడు కావడం విశేషం.


logo
>>>>>>