బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 13, 2020 , 16:27:15

దీపావళిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా?

దీపావళిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా?

హైదరాబాద్‌: దీపావళి.. నరకచతుర్ధశి అనేది హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఈ వెలుగు దివ్వెల పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. అందరి జీవితాల్లో చీకట్లు దూరమై వెలుతురు నిండాలని కోరుకుంటారు. ఇంటిని, ఆవరణను దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఇంటి ఆవరణలో ఆకట్టుకునే రంగోలీ వేస్తారు. స్వీట్లు, పిండివంటలు చేసుకుని ఇంటిల్లిపాది కలిసి సంబురంగా ఆరగిస్తారు. సాయంత్రం వేళ పటాకలు కాలుస్తారు. అయితే, ఈ పండుగను కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా జరుపుకుంటారు.  హిందూ జనాభా ఉన్న చాలా దేశాల్లో ఈ వెలుగులు పంచే పండుగను ఆనందోత్సాహల మధ్య నిర్వహిస్తారు. ఆ దేశాలేంటో ఇప్పుడు  చూద్దాం. 

సింగపూర్..


సింగపూర్‌లో ఉండే చాలామంది హిందువులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ‘లిటిల్‌ ఇండియా’ అనే ప్రాంతం చుట్టూ రంగురంగుల లైట్లతో అందంగా అలంకరిస్తారు. ఇక్కడ దీపావళి షాపింగ్‌కు ‘టెక్కా మార్కెట్’ అని పిలిచే ప్రాంతం ప్రసిద్ధి. పండుగ ప్రార్థనల కోసం చైనాటౌన్‌లో ఉన్న శ్రీ మరియమ్మన్ ఆలయానికి హిందువులు పెద్దసంఖ్యలో వెళ్తారు.  

మలేషియా..


మలేషియాలోకూడా సింగపూర్‌లాగా పెద్ద సంఖ్యలో హిందూ జనాభా ఉంది. అక్కడ దీనిని ‘హరి దీపావళి’ అని పిలుస్తారు. ఈ రోజున అక్కడి ప్రభుత్వం సెలవుదినంగా కూడా ప్రకటించింది.  భారతదేశంలోలాగే అక్కడ దీపావళిని జరుపుకుంటారు.

నేపాల్‌..


నేపాల్‌లో దీపావళిని ‘తీహార్’గా పిలుస్తారు. అక్కడ ‘దశైన్’ అని పిలువబడే దసరా తర్వాత తీహార్ దేశంలో రెండో అత్యంత ప్రసిద్ధ పండుగ. ఈ రోజున దేశప్రజలు యముడిని పూజిస్తారు. తద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. దీపావళి వేడుకలు ఇక్కడ ఐదురోజులపాటు జరుగుతాయి. ఇందులో కుక్కలు, మనుషుల మధ్య విలువైన సంబంధాన్ని తెలిపేందుకు ‘కుకుర్ తీహార్’ అనే వేడుకను నిర్వహిస్తారు. పెంపుడుకుక్కలతోపాటు ఊరకుక్కలను కూడా దండలతో సత్కరిస్తారు. వాటికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది.

ఫిజీ

దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు నివసిస్తున్న ఫిజీ దేశంలో కూడా దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది జాతీయ సెలవుదినం. ఇళ్లలో పార్టీలు నిర్వహించుకొని, అందరూ ఉత్సాహంగా గడుపుతారు.

మారిషస్..


పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ ద్వీపం మారిషస్‌ జనాభాలో దాదాపు 50% మంది హిందువులున్నారు. ఇక్కడ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలోలాగే ఇంటిని, ఆవరణను దీపాలతో అలంకరిస్తారు. పటాకలు కాలుస్తారు. 

ఈ దేశాలతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలాంటి ఇతర దేశాలలో కూడా హిందువులున్నారు. వారు కూడా పండుగను ఘనంగా జరుపుకుంటారు. అక్కడి ఆలయాల్లో పూజలు నిర్వహించి, పటాకలు కాలుస్తారు.