మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 13:57:10

ఈగ‌ను చంప‌బోతే ఇల్లు త‌గుల‌బడింది!

ఈగ‌ను చంప‌బోతే ఇల్లు త‌గుల‌బడింది!

న్యూఢిల్లీ: ఒక్కోసారి కొన్ని సంఘ‌ట‌న‌ల గురించి వింటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత చిన్న విష‌యానికే అంత ఘోరం జ‌రిగిందా.. అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. తాజాగా ఫ్రాన్స్‌లో సైతం అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ ఎనభై ఏండ్ల‌ వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి, తన ఇంటినే త‌గుల‌బెట్టుకున్నాడు. అంతేకాదు ఆ మంట‌ల్లో అత‌డు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. ఫ్రాన్స్‌లోని పార్కౌల్‌-చెనాడ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  

వివ‌రాల్లోకి వెళ్తే.. వృద్ధుడు ఇంట్లో కూర్చుని ఉండ‌గా ఒక ఈగ అత‌ని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఎన్నిసార్లు వెళ్ల‌గొట్టినా పోకుండా అది అత‌ని చుట్టూనే తిరిగడం మొద‌లుపెట్టింది. దీంతో విసిగిపోయిన వృద్ధుడు ఎల‌క్ట్రిక్ బ్యాట్‌తో దాన్ని చంపాల‌నుకున్నాడు. దాన్ని వెండిస్తూ వంటింట్లోకి వెళ్లాడు. అయితే అప్ప‌టికే వంటింట్లో గ్యాస్ లీక‌వుతున్న విష‌యాన్ని వృద్ధుడు గ‌మ‌నించ‌లేదు. దాంతో ఎల‌క్ట్రిక్ బ్యాట్ నుంచి వెలువ‌డ్డ  నిప్పుమిరుగులు గ్యాస్‌కు అంటుకుని ఒక్క‌సారిగా సిలిండ‌ర్ పేలిపోయింది. 

ఈ ఘ‌ట‌న‌లో ఇంటి పైక‌ప్పు తునాతున‌క‌లై ఎగిరిపోయింది. అదృష్ట‌వ‌శాత్తు వృద్ధుడు స్వ‌‌ల్ప గాయాల‌తో  బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ఈ ప్ర‌మాదంలో ఈగ చ‌చ్చిందా, త‌ప్పించుకుని పోయిందా అనే విష‌యం మాత్రం వృద్ధుడు గ‌మ‌నించ‌లేదు. చూశారుగా, ఈగ‌ను చంప‌బోతే ఇంతటి ఘోరం జ‌రుగుతుంద‌ని ఎవ‌రైనా ఊహిస్తారా..? ‌కానీ చాలా అరుదుగా ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డో ఒక‌చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo